అక్రమ చొరబాట్లపై అమిత్ షా ఏం చేస్తున్నారు? ఎంపీ చామల కిరణ్

దేశంలోకి ఇతర దేశాలవారు అక్రమంగా ప్రవేశిస్తుంటే హోమ్ మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు.
MP Chamala Kiran Kumar Reddy
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : దేశంలోకి ఇతర దేశాలవారు అక్రమంగా ప్రవేశిస్తుంటే హోమ్ మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. దేశవ్యాప్తంగా తొలగించిన 13 కోట్ల 30 లక్షల ఓట్లలో 3 కోట్ల మందికి అక్రమ ఓట్లు ఉన్నాయని అమిత్ షా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన మండిపడ్డారు. దేశంలో అంతర్గత భద్రత పరిస్థితి ఎలా ఉంది.?  12 ఏండ్లుగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి ఎంత మంది ఇక్కడికి వచ్చారో హోం మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలు గుజరాత్ నుంచి ఢిల్లీకి వచ్చారని, వీరి మూలంగానే 2014 నుంచి దేశానికి దరిద్రం పట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సర్ధార్ పటేల్ హోం మంత్రిగా పనిచేశారన్నారు.

భద్రతా వైఫల్యంపై నిలదీత

బీజేపీ ఎప్పటికీ అధికారంలో ఉంటుందని అమిత్ షా అంటున్నారని, అధికార బలంతో పర్మనెంట్‌గా అధికారంలో ఉండాలని చూస్తున్నారని కిరణ్ రెడ్డి ఆరోపించారు. మంగళవారంనాడు ఆయన నాంపల్లి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఓట్ల దానంతో తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారనే విషయాన్ని మరిచిపోకూడదన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. కేరళ, తమిళనాడు, హర్యానాలో ఒక్క ఓటు కూడా బీజేపీకి పడదని, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేవలం కొన్ని నదుల చుట్టూనే అభివృద్ధి చేస్తారా, మిగతా రాష్ట్రాలను అభివృద్ధి చేయరా? ఇక్కడి వారు ప్రజలు కాదా అని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే నిధులు ఇస్తామనే పిచ్చి ఆలోచన మానుకోవాలన్నారు.