

ప్రభాత ఉదయం, చౌటుప్పల్: సాగునీరు లేక మునుగోడు ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. డిండి ఎత్తిపోతల పథకంతో పాటు శివన్న గూడెం రిజర్వాయర్ నుంచి రాచకొండ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చౌటుప్పల్ మండల రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సంస్థాన్ నారాయణపురం సీపీఐఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు చేపట్టిన పాదయాత్ర మంగళవారం చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాతో ముగిసింది. 28 గ్రామాల మీదుగా 79.3 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో సాగు, తాగునీటి సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. ధర్నా అనంతరం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడారు. 2014లో నిర్మాణం ప్రారంభమైన శివన్న గూడెం ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదన్నారు. రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని, ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సంఘం సభ్యులు సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, దొడ యాదిరెడ్డి, మల్లెపల్లి లలిత, గుంటోజు శ్రీనివాస చారి, ఐత రాజు, గాలయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.