

ప్రభాత ఉదయం, కొత్తగూడెం/అశ్వారావుపేట : మురసు తుఫానుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. మంగళవారం రాత్రంతా కుండపోత వర్షం కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొన్న అర్నబ్, ఇప్పుడు మురసు తాకిడికి అన్నదాత కుదేలయ్యాడు. ప్రధానంగా వరి, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలంలో 19.7 సెంటీమీటర్లు, దమ్మపేటలో 19.18, పాల్వంచ 12, కొత్తగూడెం 11.8, బూర్గంపాడు 11.75, చుంచుపల్లి 11.6, లక్ష్మీదేవిపల్లి 10.73, భద్రాచలంలో 10.40 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా పగటివరకు వర్షం కురిసింది. ఫలితంగా జనజీవనం స్తంభించింది. పొట్ట దశలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. 2వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లుగా వ్యవసాయశాఖ అంచనా. అశ్వారావుపేట, పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో కోతకు సిద్ధమైన మినుము పంట వర్షం పాలైంది. వరుస తుఫానుల ప్రభావం కూరగాయల తోటలపైనా పడింది. దొండ, బోడ కాకరకాయ, పొట్లకాయల పూత రాలి, తీగలు మాడిపోతున్నాయి. పాలకూర, తోటకూర వంటి ఆకు నారుమళ్లు సైతం వేరు కుళ్లు తెగుళ్లతో పాడైపోయాయి. బంతి తోటలు నేలకొరిగాయి.
స్తంభించిన రాకపోకలు
తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అశ్వరావుపేట నియోజకవర్గంలోని పొంగిపొర్లుతుండటంతో గ్రామాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దమ్మపేట మండలం నెమలిపేట గ్రామం జలమయమవడంతో గ్రామస్తులను రెవెన్యూ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అశ్వరావుపేట మండలంలోని పెదబాబు ప్రాజెక్టుకు భారీగా నీరు పోటెత్తడంతో గండి పడిపోవడంతో ప్రాజెక్టులోని నీరు మొత్తం దిగువ ప్రాంతానికి వెళుతోంది. దీంతో పంట పొలాలు మునిగిపోయాయి. దొంతుకుంట చెరువుకు భారీ వరద చేరడంతో పట్టణంలోని వీధులు ముంపునకు గురికాకుండా మున్సిపల్ అధికారులు చెరువుకు గండిపెట్టి నీటిని దిగు ప్రాంతానికి విడుదల చేశారు. అంకమ్మ చెరువు అలుగు పారుతుండటంతో వాగోటిగూడెం–అశ్వరావుపేట మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నారాయణపురం–గాండ్లగూడ మధ్యలో ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో, కావడిగుండ్ల–కన్నాయిగూడెం మధ్య ఉన్న వాగు పొంగుతుండటంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకురావాలి: సీఎం
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు.