

ప్రభాత ఉదయం, అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ అద్దంకి సునీతపై సస్పెన్షన్ వేటు పడింది. అయ్యవారిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 115లోని 13.17 ఎకరాల భూమి ఇతరుల పేర్లపై అక్రమ రిజిస్ట్రేషన్ అయినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ చేయాలని అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాను ఆదేశించారు. విచారణలో భాగంగా పాత రికార్డులను పరిశీలించగా సర్వే నంబర్ 115లో ఉన్న మొత్తం 18.17 ఎకరాల భూమి.. 1971-72 నుంచి 1976-77 వరకు ద్యాప రామిరెడ్డి పేరుపై ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత 115/Aలో 13.17 రామిరెడ్డి పేరున, 115/AAలో ఐదు ఎకరాలు పి.యాదమ్మ పేరున నమోదైనట్లు తేలింది. భూమి ధ్రువీకరణలో లోపాలు ఉన్నట్లు తేలడంతో పాటు విధులు సక్రమంగా నిర్వహించడంలో తహసీల్దార్ సునీత విఫలమైనట్లు ఆఫీసర్లు నిర్ధారించారు. దీంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయంలోనే ఏఓగా పనిచేస్తున్న స్వప్నను ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియమించారు.