అడుగంటుతున్న ‘డిండి’

డిండి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజులకు సరిపడా నీరే ఉండటంతో 4 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగే ప్రమాదం ఉంది.
Dindi Project
Dindi Project
Published on: 

ప్రభాత ఉదయం, దేవరకొండ: సాగునీటి ఆధారమైన డిండి ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోతోంది. నీటి నిల్వలు తగ్గడంతో ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. మరో వారం రోజులకు సరిపడా నీటి నిల్వలే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

గతేడాది ఓవర్‌ఫ్లో..

దేవరకొండ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 36 అడుగులు (2.4 టీఎంసీల సామర్థ్యం) కాగా ప్రస్తుతం తొమ్మిది అడుగుల నీరున్నప్పటికీ ఆరు అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. గతేడాది ఎగువ ప్రాంతాన  కురిసిన భారీ వర్షాల కారణంగా 2025 ఆగస్టు 15 నుంచి కొన్ని రోజులపాటు డిండి ప్రాజెక్టు ఓవర్ ఫ్లో అయింది. ఈ ప్రాజెక్టు పరిధిలో నీటి నిల్వలు  ఎక్కువగా ఉండటంతో వరి సాగు చేపట్టారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి గరిష్ఠ స్థాయిలో36 అడుగుల వద్ద నీటి సామర్థ్యం నిలకడగా ఉంది. 2026 జూన్ 19న హెడ్ రెగ్యులేటర్ లీకేజీ కారణంగా అధికారులు ప్రాజెక్టు నీటిని కిందకు వదిలారు.

నెలరోజులుగా వారాబందీ

ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాలు లేక ఎగువ ప్రాంతం నుంచి నీరు రాక ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వానాకాలం సాగుకు ముందునుంచే వర్షాలు సరిపడా కురియవని చెబుతున్నా రైతులు వరి సాగు చేపట్టారు. ఆయకట్టు పరిధిలో నెలరోజులుగా వారాబందీ అమలు చేస్తుండటంతో  పంటలకు నీరు అందే అవకాశం లేకుండా పోయింది.  నెల రోజుల పాటు నీరందిస్తే పంట కాపాడునే అవకాశం ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల  నుంచి డిండికి నీరు అందించే అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ తిప్పర్తి రుకుమా రెడ్డి మాట్లాడుతూ..‘‘ నీటి విడుదల లేక పంటలు ఎండుతున్నాయి. దీంతో ఎకరాకు రూ.లక్షపైగా నష్టపోనున్నారు. ప్రస్తుతం ఉన్న నీటిని విడుద చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలి’’ అని కోరారు.  

అప్పులు ఎలా తీర్చాలి?

కళ్ల ఎదుటే పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.35 వేల చొప్పున సాగుకు వెచ్చించామని.. సరిపడా నీరందక ఎకరాకు 26 క్వింటాళ్లు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నీరు వదలక, భూగర్భజాలాలు అడుగంటడం.. మరో వైపు విద్యుత్ కోతల కారణంగా కంటిమీద కునుకు కరువైందని కౌలు రైతులు వాపోతున్నారు. సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆందోళన చెందుతున్నారు.   

4 వేల ఎకరాల్లో పంటనష్టం!

డిండి ప్రాజెక్టు  ఆయకట్టు మొత్తం 12,300 ఎకరాలు, రైతులు బోర్లు, వ్యవసాయ బావులు ఏర్పాటు చేసుకోవడంతో ఆయకట్టు స్థిరీకరణ పెరిగింది. ఈ ఏడాది 15వేల ఎకరాల్లో సేద్యం చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్‌లో నీరు అడుగంటడంతో నీరు విడవడం లేదు. దీంతో చివరి భూములకు నీరందడం లేదు. ఫలితంగా 4వేల ఎకరాల్లో పంట నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. డిండి ఈఈ రాములునాయక్ మాట్లాడుతూ..‘‘ డిండి ప్రాజెక్ట్‌లో వారానికి సరిపడా నీరు మాత్రమే ఉంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశాలు లేవు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరాకు అక్కడి రైతులు అడ్డుపడుతున్నారు‘‘. అని చెప్పారు.