బతికుండగానే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య నియామకం!

నల్లగొండ జిల్లాలో ఉద్యోగి బతికుండగానే మరణించినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించి కుమారుడికి కారుణ్య నియామకం కల్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.
Nalgonda fake death certificate case
Published on: 

ప్రభాత ఉదయం, నకిరేకల్‌ : ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తారు. అయితే నల్లగొండ జిల్లాలో ఇందుకు భిన్నమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగంలో ఉన్నప్పుడే పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగి.. బతికుండగానే మరణించినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం సృష్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని కీలక ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

వెరిఫికేషన్‌ లేకుండానే నియామకం!

నకిరేకల్‌ మండలం ఓగోడు గ్రామానికి చెందిన చామకూర వెంకటేశ్వర్లు 2007 అక్టోబర్‌లో శాలిగౌరారం పీహెచ్‌సీలో కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. 2023 నవంబర్‌లో ప్రభుత్వం ఆయనను రెగ్యులరైజ్‌ చేసింది. అనంతరం డిప్యుటేషన్‌పై నకిరేకల్‌ మండలం ఓగోడు పీహెచ్‌సీలో విధులు నిర్వహించారు. 2025 మే 31న ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటూ అనారోగ్యానికి గురై నవంబర్‌ 17న మృతి చెందారు.

అయితే తండ్రి ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యోగంలో ఉండగానే మరణించినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డీఎంహెచ్‌వో కార్యాలయంలోని కొందరు ఉద్యోగుల సూచనల మేరకు శాలిగౌరారం పీహెచ్‌సీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఇందుకు సహకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కుమారుడు చామకూర రాజుకు దామరచర్ల పీహెచ్‌సీలో ఉద్యోగం కల్పించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సుమారు రూ.40 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నియామకం వెనుక ఎవరెవరి పాత్ర ఉంది? నకిలీ ధ్రువీకరణ పత్రం ఎలా సృష్టించారు? అధికారుల ప్రమేయం ఎంత? అనే అంశాలపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించడంతో వైద్యశాఖలో కలకలం రేగింది.