మళ్లీ తెరపైకి జీవో 59... 4,367 దరఖాస్తుల క్లియరెన్సుకు కసరత్తు

నల్లగొండ జిల్లాలో జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న 4,367 భూ క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
మళ్లీ తెరపైకి జీవో 59... 4,367 దరఖాస్తుల క్లియరెన్సుకు కసరత్తు
Published on: 

ప్రభాత ఉదయం, నల్లగొండ: నాగార్జునసాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల కోసం గతంలో సేకరించిన భూములు, వాటిలో నిర్మించిన సాగర్ క్వార్టర్లను జీవో 59 కింద క్రమబద్ధీకరించే ప్రక్రియ నల్లగొండ జిల్లాలో మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల హామీ, ప్రజల నుంచి వస్తున్న వినతులు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. గతంలో వివిధ కారణాలతో పెండింగ్‌లో పడిపోయిన దరఖాస్తులను పరిష్కరించడానికి  సన్నాహాలు ప్రారంభించింది. నల్లగొండ జిల్లాలో నిలిచిపోయిన 4,367 దరఖాస్తులను క్లియర్ చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వీటి పరిష్కారం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది.

కసరత్తు ప్రారంభించిన అధికారులు

ఇప్పటికే రెవెన్యూ ఉన్నతాధికారుల నుంచి జిల్లా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలిసింది. దీంతో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు రంగంలోకి దిగారు. లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ డిమాండ్ నోటీసులు జారీ చేయడానికి, నిర్ణీత రుసుము చెల్లించేలా చూడటానికి చర్యలు చేపట్టారు. అయితే, ఇంత అధికసంఖ్యలో దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

జీవోలో ఏముంది?  

ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ కోసం 2014 డిసెంబర్ 30న జీవో 59ని జారీ చేశారు. అభ్యంతరం లేని భూములు, యూఎల్‌సీ మిగులు స్థలాలను నిర్ణీత రుసుముతో క్రమబద్ధీకరించడం దీని ముఖ్య ఉద్దేశం. మొదట 500 గజాల వరకే పరిమితి ఉండేది. 2017లో తెచ్చిన జీవో 35 ద్వారా ఆ పరిమితిని వెయ్యి గజాలకు పెంచారు. వెయ్యి గజాలు దాటితే కలెక్టర్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉండదు. ఆ ఫైళ్లను ప్రభుత్వానికే పంపాల్సి ఉంటుంది. నిర్దేశిత కటాఫ్ తేదీ నాటికి ఉన్న ఆక్రమణలు, అర్హతలు, ఫీజుల చెల్లింపులను పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. కొత్త దరఖాస్తులను స్వీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. గతంలో పెండింగ్‌లో పడిన పాత దరఖాస్తులను మాత్రమే ఇప్పుడు పరిష్కరిస్తున్నారు.

 మూడు దశల్లో పెండింగ్  ఫైళ్లు

జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మొత్తం 4,367 దరఖాస్తులు మూడు ప్రధాన దశల్లో నిలిచిపోయాయి. కలెక్టర్ పరిశీలనలో 3,727 దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయి. వీటికి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది. అలాగే, 554 దరఖాస్తులు ఫీజు చెల్లింపు దశలో నిలిచిపోయాయి. కలెక్టర్ ఇప్పటికే ఆమోదం తెలినా, లబ్ధిదారులు ఇంకా ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించలేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరో 86 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తుదారులు నగదు చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు.

మిర్యాలగూడలోనే అత్యధికం

మండలాలవారీగా పరిశీలిస్తే మిర్యాలగూడ డివిజన్‌లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మిర్యాలగూడ మండలంలో అత్యధికంగా 2,783 దరఖాస్తులు ఉండగా, పెద్దవూర మండలంలో 952, నల్లగొండ మండలంలో 147 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలినవి ఇతర మండలాలకు చెందినవి. ముఖ్యంగా మిర్యాలగూడ, నందికొండ మున్సిపాలిటీల పరిధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్పీ) క్వార్టర్లలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారి దరఖాస్తులే ఈ జాబితాలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 క్వార్టర్ల క్రమబద్ధీకరణ, వివాదాలు

నాగార్జునసాగర్‌లో క్వార్టర్ల క్రమబద్ధీకరణ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాగార్జునసాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం కోసం గతంలో సేకరించిన భూముల్లో నిర్మించిన క్వార్టర్లను జీవో 59 కింద క్రమబద్ధీకరించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై విచారణ చేపట్టి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో పలు వివాదాస్పద రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే ప్రభుత్వం మళ్లీ పాత దరఖాస్తుల పరిష్కారానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. గతంలో ప్రముఖులకు జరిగిన కేటాయింపులపై స్పష్టమైన సమగ్ర విచారణ తేల్చకుండానే మళ్లీ పాత ఫైళ్లను తెరవడంపై రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రెగ్యులరైజేషన్ జాబితాలో ప్రముఖుల పేర్లు

నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఈఈ, ఏఈ టైపు క్వార్టర్ల రెగ్యులరైజేషన్ జాబితాలో పలువురు రాజకీయ, ఉన్నతాధికార వర్గాల పేర్లు ఉన్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి(శాసనమండలి చైర్మన్), కుందూరు జానారెడ్డి(కాంగ్రెస్ సీనియర్ నేత), కే కేశవరావు (మాజీ ఎంపీ), దివంగత నోముల నర్సింహయ్య(మాజీ ఎమ్మెల్యే), తేరా చిన్నపరెడ్డి (మాజీ ఎమ్మెల్సీ), ఎంసీ కోటిరెడ్డి(ఎమ్మెల్సీ), బండా నరేందర్‌రెడ్డి(జెడ్పీ చైర్మన్, నల్లగొండ), కర్నాటి లింగారెడ్డి (మాజీ జెడ్పీ వైస్ చైర్మన్), యెడవల్లి విజయేందర్‌రెడ్డి(డీసీసీబీ మాజీ చైర్మన్), సీహెచ్ అనురాధ(పెద్దవూర ఎంపీపీ), అబ్బిడి కృష్ణారెడ్డి(పెద్దవూర జెడ్పీటీసీ) లాంటి రాజకీయ ప్రముఖులు; ఏ రాజశేఖర్‌రెడ్డి(జడ్జి), టీ చంద్రశేఖర్‌రెడ్డి(ఓఎస్డీ), వీ గోవర్ధన్‌రెడ్డి(ఓఎస్డీ), కే భాగ్యతారెడ్డి(రిటైర్డ్ సీఈ), డీ విష్ణుమూర్తి(రిటైర్డ్ డీఈ), డీ నాగేశ్వరరావు (కాంట్రాక్టర్), అలాగే నాట్కో ఎండీ, ఏపీ ఫార్మా కంపెనీ, గడ్డం రవీందర్ రెడ్డి, బీ శ్రీనివాసరాజు, ఎం లింగారెడ్డి, గాదె ప్రవల్లిక చౌదరి లాంటి అధికారులు, ఇతరుల పేర్లు ఉన్నాయి.