నిరుపయోగంగా నారాయణపేట మార్కెట్

నారాయణపేటలో నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రజలకు ఉపయోగపడేలా మార్చేందుకు కలెక్టర్, ఎమ్మెల్యేతో చర్చిస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్వేతసత్యయాదవ్ తెలిపారు.
Narayanpet Integrated Market
Narayanpet Integrated Market
Published on: 

ప్రభాత  ఉదయం, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో రోడ్ల వెంట చిరువ్యాపారం చేసుకునే వారి కోసం బీఆర్‌ఎస్ హయాంలో రూ.8 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిరుపయోగంగా మారింది. 2022లో బస్టాండ్ ఎదురుగా 1.5 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణం చేపట్టి 2023లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  ప్రారంభించారు. అయితే, ఆ మార్కెట్ జనావాసాలకు దూరంగా ఉండటంతో వీధి వ్యాపారులు అక్కడికి వెళ్లకుండా  రోడ్ల పక్కనే వ్యాపారం చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నెరవేరకుండానే పోయింది.   

రెండ్రోజుల ముచ్చటే..

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఆగమేఘాల మీద పూర్తిచేసి వీధి వ్యాపారులను అక్కడికి తరలించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు వ్యాపారులకు  అవగాహన కల్పించారు. అక్కడ రెండ్రోజులు మాత్రమే అమ్మకాలు చేసిన వ్యాపారులు, వ్యాపారం కొనసాగక తిరిగి రోడ్లపక్కకే చేరుకున్నారు. మార్కెట్​లోకి వినియోగదారులు రావడం లేదని, దీంతో తమ గిరాకీ దెబ్బతిన్నదని, అక్కడ వ్యాపారం చేసుకోలేమని తేల్చిచెప్పారు. అయినప్పటికీ మరోసారి అధికారులు వీధివ్యాపారులను తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. 

ఆస్పత్రి నిర్మిస్తామని  చెప్పి..

బీఆర్ఎస్​ హయాంలో మార్కెట్‌ను నిర్మించి నిధులు వృథా చేశారని భావించిన నేటి కాంగ్రెస్​ పాలకులు, ఆ మార్కెట్​ను మరో రకంగా వినియోగంలోకి  తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. బస్టాండ్​ ముందు ఉన్న మెటర్నిటీ ఆస్సత్రిని ఆ భవనంలోకి మార్చాలని ఇంజినీర్లతో ఎస్టిమేట్​ వేయించి ప్రభుత్వానికి పంపారు. రూ.2 కోట్లతో ప్రపోజల్స్​ పంపగా నిధులు కూడా మంజూరయ్యాయి.  భవనాన్ని బదలాయించేందుకు మున్సిపల్ శాఖ ఒప్పుకోకపోవడంతో అదికాస్తా రద్దయ్యింది.  

కలెక్టర్​ ప్రయత్నం వృథా..

సమీకృత మార్కెట్​ను చేతివృత్తుల వ్యాపారస్తుల కోసం వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ముందుకొచ్చారు. మొదట ప్రజలు అలవాటు పడేందుకు వారానికి ఒకరోజు అమ్మకాలు జరుగుతాయని ప్రచారం చేశారు.  అది ఒక్కరోజుకే పరిమితం కావడంతో  అందుబాటులోకి రాకుండా పోయింది. జనసంచారం ​ లేనిచోట మార్కెట్‌ను నిర్మించి నిధులు వృథా చేయడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘కలెక్టర్, ఎమ్మెల్యేతో మాట్లాడి సమీకృత మార్కెట్​ను ప్రజలకు ఉపయోగపడేలా చర్చలు తీసుకుంటాం’ అని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్వేతసత్యయాదవ్ తెలిపారు.

రోడ్డు వెంట వ్యాపారం చేస్తున్న మహిళ
రోడ్డు వెంట వ్యాపారం చేస్తున్న మహిళ