ఫాగింగ్ బంద్‌.. సీజనల్ కల్లోలం

Karimnagar Seasonal Diseases Mosquito Fogging
Published on: 
సీజనల్ వ్యాధుల నియంత్రణపై నిర్లక్ష్యం
సమస్యలపై రివ్యూలకే పరిమితమవుతున్న అధికారులు
బ్లీచింగ్‌తోనే సరిపెడుతున్న పంచాయతీ సిబ్బంది

ప్రభాత ఉదయం, పెద్దపల్లి:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణలో సంబంధిత శాఖల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో దోమల నివారణ కోసం ఫాగింగ్ తప్పనిసరి చేసినా అది ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,214 గ్రామ పంచాయతీలకు గానూ ఫాగింగ్ మిషన్లు 673 మాత్రమే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. గత పదేళ్లుగా గ్రామాల్లో, పట్టణాల్లో ఫాగింగ్ చేయడం నామమాత్రమైందని స్థానిక వాసులు మండిపడుతున్నారు. ప్రతీ ఏటా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు.

నిధులు లేకపోవడం వల్లే సమస్య

సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దోమల వల్ల వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, డయేరియా లాంటి వ్యాధుల బారిన పడి పలువురు చనిపోయిన సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. చాలా గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లి వదిలేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామాలకు సరిపోయే నిధులు లేకపోవడం మూలంగానే పరిస్థితులు తీవ్రమవుతున్నట్లు ఆయా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, నిర్మూలన విషయంలో మాత్రం విఫలమవుతోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

ఫాగింగ్ తప్పనిసరి..

గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ఫాగింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం చెప్పినా అది ఎక్కడా అమలు అయినట్లు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ఫాగింగ్ చేసిన ప్రతీసారి ఆయా వార్డుల జనాభాను బట్టి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చు అవుతుంది. చాలా గ్రామ పంచాయతీల్లో ఖర్చును భరించలేక ఫాగింగ్ మిషన్లను పక్కన పెట్టారు. దీంతో చాలా మిషన్లు పాడైపోయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి జనాభాను బట్టి ప్రతీ వార్డుకు రెండు చొప్పున ఫాగింగ్ మిషన్లు ఉండాలి. కానీ మొత్తంగా 28 మాత్రమే ఉన్నట్లు సమాచారం. వాటిపై కూడా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలా వరకు మూలకు పడుతున్నట్లు తెలుస్తోంది.

సమస్యకు పరిష్కారం ఎక్కడ?

మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల జనాభాను అనుసరించి ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు బడ్జెట్ కేటాయిస్తున్నా అది పక్కదారి పడుతున్న మూలంగానే నిధుల కొరత తీవ్రమవుతోందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. పాలక మండళ్లు ఏర్పాటైనప్పటికీ సమస్య పరిష్కారం మాత్రం కావడం లేదని స్థానిక వాసులు చెబుతున్నారు. గత ఏడాది ఉన్న మాదిరిగానే ఆయా గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికైనా అవసరమైన చోట ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేసి దోమల నివారణపై దృష్టి పెట్టి, సీజనల్ వ్యాధులను నిర్మూలించాల్సిన అవసరముందని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.