

ఖమ్మం, ప్రభాత ఉదయం: నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి బౌద్ధ వారసత్వ, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల బౌద్ధులతోపాటు కంబోడియా, థాయిలాండ్ దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులతో కలెక్టర్ మంగళవారం సందర్శించారు. బౌద్ధక్షేత్రంలో మౌళిక సదుపాయాల అభివృద్ధి, పురాతన కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణపై బౌద్ధ బిక్షువుల సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రాచీన బౌద్ధ పురావస్తు క్షేత్రాల్లో ఇది ఒకటని, నాడు ప్రముఖ ధార్మిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లిందని గుర్తుచేశారు. ఈ చారిత్రక సంపదను పరిరక్షిస్తూ భావితరాలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశవిదేశాల బౌద్ధ యాత్రికులను ఆకర్షించేలా బౌద్ధక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పనుల ప్రణాళిక రూపకల్పనకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.2.50 కోట్లతో బౌద్ధక్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని హెరిటేజ్ తెలంగాణ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు తెలిపారు. మౌలిక సౌకర్యాలు, సందర్శకుల మార్గాలు, ప్రాంగణ సుందరీకరణ, సమాచార సూచికల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రూ.1.76 కోట్లతో ప్రాచీన బౌద్ధ విహారాలు, సమావేశ మందిరం, పురావస్తు నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాసరావు, హెరిటేజ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్లు డా.పి.నాగరాజు, ఎన్.నరసింగ్, సూపరింటెండెంట్ ఎ.రాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, ఇంటర్మీడియెట్ అధికారి రవిబాబు తదితరులు పాల్గొన్నారు.