

దేవరకొండ, ప్రభాత ఉదయం: ఎకో టూరిజం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. డివిజన్ పరిధిలోని నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీలో ఎకో టూరిజం ఏర్పాటుకు గత ప్రభుత్వం 17.17 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.3.60 కోట్లతో పనులకు శంకుస్థాపన చేసింది. టూరిజం అభివృద్ధితో తమ జీవనప్రమాణాలు మెరుగుపడతాయని భావించిన ప్రజల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక పర్యాటక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వవడంతో వైజాగ్ కాలనీతో పాటు దేవరకొండ ఖిల్లా, దేవరచర్ల మునుస్వామి దేవాలయం, గాజుపీయడం గుహలకు పర్యాటకుల రద్దీ పెరుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు హైదరాబాద్‌తో పాటు పొరుగు జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారని.. ప్రభుత్వం చొరవ తీసుకుని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.