పూర్తి హక్కులతో ఇందిరమ్మ ఇళ్ల రిజిస్ట్రేషన్ : మంత్రి పొంగులేటి

తెలంగాణలో తొలి విడతగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
minister ponguleti srinivasa reddy
Minister Ponguleti Srinivas
Published on: 

ప్రభాత ఉదయం, మేడ్చల్: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదని, అర్హతే ప్రామాణికమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అధికార పక్షం వాళ్లయినా, ప్రతిపక్షం వాళ్లయినా సంక్షేమ పథకాల పంపిణీలో వివక్ష చూపేది లేదని తేల్చిచెప్పారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పోచారంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డితో క‌లిసి బుధవారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్​లో భూముల ధర వందల కోట్లు ఉన్నప్పటికీ, నివసిస్తున్న ప్రాంతాల్లోనే పేదలకు గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించాలనే లక్ష్యంతో నగరంలోనే ఇందిరమ్మ టవర్స్​ను నిర్మిస్తున్నామన్నారు. సిటీలో జీవనోపాధి పొందుతున్న పేదలను దూర ప్రాంతాలకు తరలించి, వారి ఉపాధికి గండికొట్టే విధానానికి స్వస్తి పలికామని మంత్రి పొంగులేటి చెప్పారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

‘‘కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్​) పరిధిలో మొదటి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. 23 నియోజకవర్గాల్లో పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశాం. ఇప్పటికే ఆరు చోట్ల ఇందిర‌మ్మ ట‌వర్స్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశాం. మేడ్చల్ నియోజకవర్గంలో తొలి విడతగా 480 మంది లబ్ధిదారులను పారదర్శకమైన బహిరంగ డ్రా ద్వారా ఎంపిక చేశాం. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారిని గుర్తించి, అర్హతలను ధ్రువీకరించిన అనంతరం పారదర్శకంగా డ్రా నిర్వహించాం. ఎంపికైన వారిలో స్థానికంగా నివసించే అర్హులనే నిర్ధారించి ఇళ్లు కేటాయిస్తున్నాం” అని పొంగులేటి పేర్కొన్నారు.

పూర్తి హక్కులతో ఇళ్ల రిజిస్ట్రేషన్

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు 2.20 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ‘‘వచ్చే బతుకమ్మ పండుగ నాటికి తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పనులను పూర్తి చేసి, తాళాలు ఇవ్వాలనేది మా లక్ష్యం. తొలి విడతలో అవకాశం దక్కని అర్హులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తదుపరి విడతల్లో కొత్త దరఖాస్తుదారులతో సహా అర్హులందరినీ పరిశీలిస్తాం” అని మంత్రి వెల్లడించారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెండో విడ‌త ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ కోసం త్వరలోనే మ‌రోసారి ద‌ర‌ఖాస్తులు తీసుకుంటామ‌న్నారు. ఇందిరమ్మ టవర్స్​కు ఎంపికైన లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలు ఇచ్చి సరిపెట్టబోమని, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి హక్కులతో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మంత్రి ప్రకటించారు. ప్రతీ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన భూమిలో వాటాను కూడా రిజిస్ట్రేషన్‌లో పొందుపరుస్తామని పొంగులేటి పేర్కొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లనూ పూర్తి చేస్తాం

గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్న కాల‌నీల్లో మౌలిక స‌దుపాయాల కల్పన కోసం సుమారు రూ.440 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రుల చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్​ నర్సింహులు యాదవ్,  జిల్లా గ్రంధాల‌య చైర్మన్​ శ్రీ‌నివాస‌రెడ్డి,  హౌసింగ్ శాఖ ఎండీ వి.పి.గౌత‌మ్, కలెక్టర్​ మ‌నూచౌద‌రి తదితరులు పాల్గొన్నారు.