

1983లో అఖండ విజయం సాధించి అధికార పీఠాన్ని అధిరోహించిన ఎన్టీఆర్‌కు.. ఏడాది తిరగకముందే నాదెండ్ల భాస్కరరావు సంక్షోభం రూపంలో ఊహించని సవాల్ ఎదురైంది. ఆ సంక్షోభం నుంచి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎన్టీఆర్ నాయకత్వానికి అసలైన పరీక్షగా నిలిచింది. వెండితెరపై కథానాయకుడు ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయం సాధించినట్లే.. రాజకీయ తెరపైనా ఎన్టీఆర్ సంక్షోభాన్ని ఎదుర్కొని తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే అక్కడితో ఆగలేదు. తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ.. తనకు ప్రజల మద్దతు ఉందని మరోసారి నిరూపించుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ పదవీకాలం పూర్తయ్యేందుకు ఇంకా దాదాపు నాలుగేళ్ల సమయం ఉన్నప్పటికీ.. 1985లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రజల తీర్పును కోరిన ఎన్టీఆర్.. గత విజయాన్ని మించిన ఘనతను సాధిస్తూ తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చారు. నాదెండ్ల సంక్షోభం తన రాజకీయ పునాదులను కదిలించలేదని.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపై తనకు తిరుగులేని ప్రజా మద్దతు ఉందని ఈ విజయంతో మరోసారి నిరూపించారు.
కుట్రతో గద్దె దించారు.. ప్రజలు మళ్లీ పీఠంపై కూర్చోబెట్టారు
1983లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో గవర్నర్ గా ఠాకూర్ రామ్‌లాల్ ఉన్నారు. 1984లో ఎన్టీఆర్ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలోని ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే, తనకు అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉందని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే నాటి గవర్నర్ రామ్‌లాల్, ఎన్టీఆర్ బలపరీక్ష నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండానే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. 1984, ఆగస్ట్ 16న మెజారిటీ లేని నాదెండ్ల భాస్కరరావుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు, "ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి" దారితీసింది. ప్రజా ఒత్తిడి, దేశవ్యాప్త రాజకీయ నిరసనల కారణంగా రామ్‌లాల్ 1984 ఆగస్ట్ 24న రాజీనామా చేశారు. కేంద్రం రామ్‌లాల్ స్థానంలో 1989, ఆగస్ట్ 29న శంకర్ దయాళ్ శర్మను గవర్నర్‌గా నియమించింది. శంకర్ దయాళ్ శర్మ అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించగా నాదెండ్ల భాస్కరరావుకు మెజారిటీ లేకపోవడంతో ఆయన సెప్టెంబర్ 16న సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 1984, సెప్టెంబర్ 16 తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ముందస్తుకు ఎందుకు వెళ్లారు?
ఆగస్ట్ సంక్షోభంతో తనపై జరిగిన రాజకీయ కుట్ర, పార్టీలో ఏర్పడిన అనైక్యతకు తెరదించి, ప్రజల నుంచి మరోసారి స్పష్టమైన, పూర్తి స్థాయి ప్రజా తీర్పును కోరాలనే బలమైన రాజకీయ వ్యూహంతో 1984 నవంబర్ 22న ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తన పదవీచ్యుతి సమయంలో కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోవడం, రాజకీయ అస్థిరత తలెత్తడంతో పార్టీలో ద్రోహులను, వెన్నుపోటుదారులను ఏకాకిగా చేయడానికి, పార్టీని ప్రక్షాళన చేయడానికి కూడా ఆయన ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్నారు.
మూడో సారి ముఖ్యమంత్రిగా
1985 మార్చి 9న ఎన్టీఆర్ మూడోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1985 మార్చి 5న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికలల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ 202 స్థానాలను గెలుచుకుని తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకోగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కేవలం 50 సీట్లకే పరిమితమైంది. ఆగస్ట్ సంక్షోభం సందర్భంగా చేదోడువాదోడుగా నిలిచిన సీపీఐ, సీపీఎం, బీజేపీ, జనతా వంటి పరస్పర విరుద్ధ రాజకీయ సిద్ధాంతాలు ఉన్న పార్టీలతో కలిసి కూటమి కట్టారు. ఇందులో సీపీఐ 11 స్థానాలు, సీపీఎం 11 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 8, జనతా పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తంగా కూటమి 235 సీట్లను గెలుకుచుకుంది.
ఒకేసారి 3 నియోజకవర్గాల్లో పోటీ
1985 శాసనసభ ఎన్నికల్లో ఎన్.టి. రామారావు రాష్ట్రంలోని మూడు విభిన్న ప్రాంతాలను ప్రతిబింబించేలా హిందూపురం (రాయలసీమ), గుడివాడ (కోస్తా ఆంధ్ర), నల్గొండ (తెలంగాణ) నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఈ మూడు చోట్లా ఆయన ఘన విజయం సాధించారు. ఆ విధంగా ఒకేసారి మూడు నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన అరుదైన రికార్డును నెలకొల్పారు. తర్వాత ఆయన హిందూపురం స్థానాన్ని ఉంచుకుని మిగిలిన రెండింటికీ రాజీనామా చేశారు.
1983లో ‘ఆత్మగౌరవం’.. 1985లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’
1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారానికి ప్రధాన బలం ‘తెలుగు ఆత్మగౌరవం’. ఢిల్లీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే నాయకుడిగా తనను తాను ప్రజల ముందు నిలబెట్టారు. 1985 నాటికి ఆ కథనానికి మరో బలమైన అంశం చేరింది—‘ప్రజాస్వామ్య పరిరక్షణ’. తనకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాజకీయ కుట్రతో లాక్కున్నారని ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో 1985 ఎన్నికలు సాధారణంగా టీడీపీ–కాంగ్రెస్ మధ్య పోరుగా కాకుండా.. ఒకవైపు ఎన్టీఆర్ నాయకత్వం, మరోవైపు ఆయన ప్రభుత్వం కూల్చడానికి జరిగిన రాజకీయ కుట్ర అనే భావోద్వేగ అంశం చుట్టూ కూడా సాగాయి. 1983లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్‌ను ఎన్నుకున్న ఓటర్లు.. 1985లో ఆయనను తిరిగి గెలిపించడం ద్వారా తమ ఓటుతో జరిగిన పరిణామాలకు సమాధానం చెప్పినట్లైంది.
సంక్షేమ పథకాలు.. పేదలతో బలమైన అనుబంధం
1983లో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్.టి. రామారావు ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలు 1985 ముందస్తు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయానికి బలమైన పునాదిగా నిలిచాయి. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, పాలన ప్రారంభమైన స్వల్ప వ్యవధిలోనే క్షేత్రస్థాయికి చేరిన ఈ పథకాలు ప్రభుత్వాన్ని పక్కా ప్రజాకేంద్రిత పాలనగా నిలబెట్టాయి. ముఖ్యంగా సమాజంలో అత్యంత పేద కుటుంబాల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన రూ. 2 లకే కిలో బియ్యం పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపి, ఎన్టీఆర్‌ను వారి గుండెల్లో ‘అన్న’గా స్థిరపరిచింది. దీనికి తోడు నిరుపేదలకు, దళిత, గిరిజన వర్గాలకు శాశ్వత నివాసాలు కల్పించేందుకు చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణం, చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ పేదలకు అతి తక్కువ ధరలకే బట్టలు అందజేసే జనతా వస్త్రాల పంపిణీ, మరియు వృద్ధులు, వికలాంగులకు అందించిన సామాజిక భద్రతా పెన్షన్లు ప్రభుత్వంపై ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని పెంచాయి. అలాగే వ్యవసాయ రంగానికి విద్యుత్ ఛార్జీల తగ్గింపు, సబ్సిడీపై ఎరువులు అందించడం ద్వారా రైతు కూలీలు, సామాన్య రైతుల ఆదరణను పొందింది. 1984 నాటి నాదెండ్ల భాస్కరరావు సంక్షోభం తర్వాత ఎన్టీఆర్ ప్రజల వద్దకు వెళ్లినప్పుడు, ఈ సంక్షేమ పథకాల ద్వారా ఏర్పడిన బలమైన అనుబంధం ఓటర్లను పూర్తిగా టీడీపీ వైపే నిలబెట్టి, 1985లో మరోసారి తిరుగులేని విజయానికి దోహదపడింది.
బీసీలకు ప్రాధాన్యం.. కొత్త సామాజిక నాయకత్వం
1983లోనే ఎన్టీఆర్ సంప్రదాయ రాజకీయ కుటుంబాల ఆధిపత్యానికి భిన్నంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించారు. 1985లోనూ ఆ ధోరణి కొనసాగింది. ముఖ్యంగా బీసీలు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా టీడీపీ తన సామాజిక పునాదిని విస్తరించుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఎదుగుతున్న నాయకులకు అవకాశం లభించడంతో.. వారు కేవలం ఎమ్మెల్యేలుగా కాకుండా పార్టీకి స్థానిక స్థాయిలో బలమైన కేడర్‌గా మారారు. ఫలితంగా టీడీపీకి ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రజాదరణతో పాటు విస్తృతమైన సామాజిక మద్దతు కూడా ఏర్పడింది.
కాంగ్రెస్‌కు మరోసారి కోలుకోలేని దెబ్బ
1983లోనే కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. నాదెండ్ల సంక్షోభం తర్వాత కూడా ఆ పార్టీ తన రాజకీయ స్థితిని పూర్తిగా పునరుద్ధరించుకోలేకపోయింది. ఎన్టీఆర్ ప్రభుత్వం కూల్చడంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పాత్ర ఉందనే ప్రచారం టీడీపీకి మరింత రాజకీయ ఆయుధంగా మారింది. మరోవైపు కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు, నాయకత్వ సమస్యలు, రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన ప్రతికూలత పార్టీని బలహీనపరిచాయి. దీంతో 1985లో ఎన్టీఆర్‌పై ఏర్పడిన సానుభూతి, టీడీపీ సంస్థాగత బలం, సంక్షేమ పథకాల ప్రభావం, కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత అన్నీ కలిసి కాంగ్రెస్‌కు మరోసారి భారీ దెబ్బ కొట్టాయి.
ఎన్టీఆర్‌కు వ్యక్తిగతంగా ఎందుకు కీలకం?
1985 ఎన్నికలు కేవలం టీడీపీ విజయమే కాదు.. ఎన్టీఆర్ నాయకత్వంపై ప్రజలు ఇచ్చిన రెఫరెండంగా చూడదగినవి. ఎన్నికలకు ముందు ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. పార్టీ ఎమ్మెల్యేలు చీలిపోయిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. గవర్నర్ నిర్ణయంతో ప్రభుత్వం దూరమైంది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడారు. ఇలాంటి పరిస్థితుల తర్వాత సాధారణంగా అధికార పార్టీ బలహీనపడటం సహజం. కానీ ఎన్టీఆర్ మాత్రం సంక్షోభాన్ని ప్రజల్లో సానుభూతిగా, సానుభూతిని ఎన్నికల మద్దతుగా మార్చుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి తీర్పు కోరితే.. వారు మరింత బలమైన మెజారిటీ ఇచ్చారు.
సంక్షోభాన్నే విజయాయుధంగా మార్చుకున్న నాయకుడు
ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో 1985 ఎన్నికలకు ప్రత్యేక స్థానం ఉంది. 1983లో ఆయన ‘తెలుగు ఆత్మగౌరవం’ అనే భావోద్వేగాన్ని రాజకీయ శక్తిగా మార్చుకున్నారు. 1984 సంక్షోభం తర్వాత అదే రాజకీయ శక్తికి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ను జోడించారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. బీసీలు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ కొత్త సామాజిక నాయకత్వాన్ని నిర్మించారు. మరోవైపు కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. అందుకే 1983లో కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిన ఎన్టీఆర్.. 1985లో తన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నానికి ప్రజల తీర్పుతో సమాధానం ఇచ్చారు. తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఎంతటి ఘనతో.. అధికారాన్ని కోల్పోయి, తిరిగి ప్రజల వద్దకు వెళ్లి మరింత బలమైన మెజారిటీతో అదే అధికారాన్ని సాధించడం అంతకంటే అరుదైన రాజకీయ ఘట్టం. 1985 విజయం ఎన్టీఆర్ కేవలం ప్రజాకర్షణ ఉన్న సినీనటుడి నుంచి.. సంక్షోభాలను సైతం రాజకీయ విజయాలుగా మలుచుకోగల సమర్థ నాయకుడిగా ఎదిగిన దశను సూచించింది.
టీడీపీకి..లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా
1985 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగిన లోకసభ ఎన్నికలు టీడీపీకి ఉన్న ప్రజాశక్తిని నిరూపించాయి. 1984 డిసెంబరులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ హత్యతో దేశవ్యాప్తంగా వీచిన సానుభూతి పవనలతో కాంగ్రెస్ పార్టీ 403 సీట్లను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపించిన ఎన్టీఆర్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కు పరాభావం ఎదురైంది. ఆ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ 30 స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం ఆరు సీట్లకు మాత్రమే పరిమితమైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్ (CPM), జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ (BJP), ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM), మరియు ఇండియన్ కాంగ్రెస్ - సోషలిస్ట్ (ICS) చెరో ఒక్క సీటును గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ప్రభంజనంలో దేశంలో ఏ ఇతర పార్టీలు టీడీపీ స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో లోక్‌సభలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా నిలిచి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా (Main Opposition Party) పొందిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించింది.
నేషనల్ ఫ్రంట్ తో..జాతీయ రాజకీయాల్లోనూ ముద్ర
ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాష్ట్రాల హక్కుల సాధనలో జాతీయ స్థాయిలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చారు. 1984లో ఎంజీఆర్‌కు, 1987లో హర్యానాలో దేవీలాల్‌కు, 1988 శాసనసభ ఎన్నికల్లో కరుణానిధికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన అన్ని సందర్భాల్లో వారు గెలిచారు. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించే పార్టీలను ఒక్కతాటి మీదకు తెచ్చారు.సైద్ధాంతికంగా భిన్న ధ్రువాలైన బీజేపీ, వామపక్షాల నాయకుల్ని ఒకే వేదికపై తేగలిగారు. జనతా పార్టీ, లోక్‌దళ్, జన్‌మోర్చా, డీఎంకే, ఏజీపీ, కాంగ్రెస్ (ఎస్) వంటి పార్టీలన్నీ కలిసి 1988లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. దాని ఛైర్మన్‌గా ఎన్టీఆర్ 1989లో కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి రావటంలో చురుకైన పాత్ర పోషించారు. 1985 నాటి ఈ పరిణామాలు ఎన్టీఆర్‌ను కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా, జాతీయ రాజకీయాలను శాసించగల కీలక నాయకుడిగా నిలబెట్టాయి.