

ప్రభాత ఉదయం, మహేశ్వరం : నకిలీ పత్రాలను ఉపయోగించి ఆధార్, పాన్ కార్డుల్లో దర్జాగా మార్పులు, చేర్పులు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన శంషాబాద్ పోలీస్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పహాడీషరీఫ్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం శ్రీరామ్ కాలనీలోని అతని నివాసంపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పహాడీషరీఫ్ ఠాణా ఇన్స్పెక్టర్ బి. లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ్ కాలనీలో నివాసం ఉండే చింతల మహదేవ్ (36) బుద్వేల్‌లో ‘కవిత ఏ టు జెడ్ ఆన్లైన్ సర్వీసెస్’ పేరుతో జిరాక్స్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఆదాయం అరకొరగా ఉండటంతో కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ కార్డుల తయారీకి పాల్పడ్డాడు.
పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తన నివాసంలో ల్యాప్‌టాప్, ప్రింటర్, లామినేషన్ యంత్రాల సహాయంతో నకిలీ పత్రాలను తయారు చేసేవాడు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని ఇతర రాష్ట్రాల వారికి ప్రైవేటు ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు పొందేందుకు, మొబైల్ సిమ్ కార్డులు తీసుకునేందుకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వీటిని అందించేవాడు. నిషేధిత సాఫ్ట్వేర్ల ద్వారా ఆధార్, పాన్ కార్డుల్లో పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలను మారుస్తూ ఒక్కో మార్పునకు రూ.300 నుంచి రూ.1,000 వరకు వసూలు చేసేవాడని ఇన్స్పెక్టర్ వెల్లడించారు.
పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నకిలీ ఆధార్, పాన్ కార్డులను తయారు చేయడం, వాటిని ఉపయోగించడం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI), ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను ఉల్లంఘించడమేనని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారితో పాటు వాటిని చేయించుకున్న వారిపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ ఆపరేషన్‌లో శంషాబాద్ పోలీస్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ డి. కృష్ణమోహన్, ఎస్ఐలు ఎస్. శేషు, కె. మన్సూర్ అలీ, ఎన్. నర్సింహారావు, షాద్‌నగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పహాడీషరీఫ్ ఠాణా ఎస్ఐ షెఖ్ అజీజ్, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.