డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలి

పాలమూరు జలాలను ఇతర ప్రాంతాలకు తరలించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ డిండి ప్రాజెక్టును రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
Palamuru JAC demands for the cancellation of Dindi Lift Irrigation
Palamuru JAC demands for cancellation of Dindi Lift Irrigation
Published on: 

ప్రభాత ఉదయం, కల్వకుర్తి: డిండి ఎత్తిపోతల పథాకాన్ని రద్దు చేయాలని పాలమూరు అధ్యయన వేదిక జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం కల్వకుర్తి పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయకపోతే పాలమూరు ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరులోని సహజ వనరులు, జలాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే పాలకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే పాలమూరు నుంచి ఇతర ప్రాంతాలకు సాగు, తాగునీటిని తరలిస్తుండగా.. కొత్తగా డిండి ప్రాజెక్టు పేరుతో కేటాయింపులు చేయడం ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడమేనని, దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ.. కల్వకుర్తి పేరుతో నిర్మించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా స్థానిక రైతులకు ఆశించినస్థాయిలో సాగునీరు అందడం లేదని, ఇది పేరుకే కల్వకుర్తి పథకమని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు ఉన్నా రైతులు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లావాసి అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఈ ప్రాంత రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుల జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పేరుతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆరోపించారు  ఎర్రవెల్లి–గోకారం రిజర్వాయర్‌ ఎత్తు తగ్గించాలని కోరుతూ భూనిర్వాసితులు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.  మహాధర్నాకు వచ్చిన రైతులు ముఖ్యమంత్రి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి సమీపంలోని మాడ్గుల మండలం ఇర్విన్‌ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహాధర్నాలో ఎర్రవెల్లి, ఇర్విన్‌ భూనిర్వాసితులతోపాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.