తాళాలకే పరిమితమా?

వ్యవసాయ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి మూడేళ్లు గడిచినా గదులకు అద్దె కేటాయింపులు జరగలేదు. అద్దెను రూ.2,500కు తగ్గించాలని వ్యాపారులు కోరుతున్నారు.
Parkala Agriculture Market
Parkala Agriculture Market Shopping Complex Rent Issues
Published on: 

ప్రభాత ఉదయం, పరకాల: నియోజకవర్గ పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించి మూడేళ్లు గడుస్తోంది. నేటికీ వాటిని అద్దెకు ఇవ్వడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఈ విషయమై పట్టణ ప్రజలు ఆరా తీస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రూ.84 లక్షల నిధులతో వ్యవసాయ మార్కెట్ ప్రధాన ద్వారం ప్రక్కనే 20 గదులతో నూతనంగా వ్యాపార షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఏళ్లు గడుస్తున్నా, ముగ్గురు మార్కెట్ కమిటీ చైర్మన్లు మారినా కాంప్లెక్స్‌లోని రూంలు నిర్వాహణకు నోచుకోకపోవడటానికి గల కారణాలు ఏమిటని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై పలువురు వ్యాపారులు స్పందిస్తూ, రూంల అద్దె ధరను రూ.4250 (ఒక్కొక్కటి) నిర్ణయించడంతో వాటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదంటున్నారు. రూ.2500 వరకు ఉంటే చాలామంది ముందుకు వస్తారని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. “గత 6 సంవత్సరాల నుంచి ఇదే వ్యవసాయ మార్కెట్‌లో పత్తి వ్యాపారం చేస్తున్నాను. నాకు రూం లేక మార్కెట్ చెట్ల కిందనే వ్యాపారం చేయాల్సి వస్తున్నది. అధికారులు స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన ధరను తగ్గిస్తే బాగుంటుంది” అని ఒంటేరు సారయ్య అనే మార్కెట్ వ్యాపారి పేర్కొన్నాడు. ‘ప్రభుత్వం నిర్ణయించిన ధర చాలా ఎక్కువ. కనీసం రూ.2500 ఉండేలా చూడాలి’ అని మేకల దేవేందర్ అనే హోటల్ నిర్వాహకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.