చేతులెత్తి అడుగుతున్నా.. ఒక్క అవకాశమివ్వండి : పవన్ కల్యాణ్

తెలంగాణలో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ పట్టభద్రులను కోరారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారం కోసం ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్‌’ను ప్రారంభించారు.
Pawan Kalyan Janasena Graduate Express campaign launch
Pawan Kalyan Janasena Graduate Express campaign launch
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ‘‘ మొదటి సారిగా చేతులెత్తి అడుగుతున్నా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో తెలంగాణలో ఒక్క అవకాశం ఇవ్వండి’’ అని జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టభద్రులను అభ్యర్థించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ ప్రచారం రథాన్ని శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావును గెలిపించాలని కోరారు. ఈ గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఎన్నికల ప్రచార వాహనంగానే కాకుండా, యువత సమస్యలను నిరంతరం తెలుసుకునే వేదికగా కొనసాగుతుందన్నారు.

యువత భవిష్యత్తు, ఆకాంక్షల కోసం శ్రీనివాసరావు ప్రచార రథం ద్వారా ప్రజల్లోకి వస్తున్నట్లు చెప్పారు. 120 రోజులపాటు ప్రజలలో ఉండనున్న ఈ ప్రచార రథం ఆవశ్యకతను పట్టభద్రులు  గుర్తించాలని సూచించారు.

‘‘ప్రచార రథంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పట్టభద్రుల కుర్చీలో కూర్చుని, మీ సమస్యలు, ఆలోచనలను పంచుకుని, ఆకాంక్షలను, ఆశయాలను తెలియజేసి మద్దతుగా నిలవాలి’’ అని కోరారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, సామాజిక సేవకులు, డిజిటల్ మీడియా ప్రతినిధులు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.