‘ఓ లింగ.. ఓ లింగా’..పెద్దగట్టు మహా జాతర

 ‘ఓ లింగ.. ఓ లింగా’..పెద్దగట్టు మహా జాతర
Published on: 

తెలంగాణ పల్లె సంస్కృతిలో జాతర్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక ప్రాంతం ఆచారాలను, ఒక సమాజం విశ్వాసాలను, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే వేదికలుగా ఇవి నిలుస్తాయి. అలాంటి ప్రత్యేకమైన జాతర్లలో సూర్యాపేట జిల్లా దురాజుపల్లిలో జరిగే పెద్దగట్టు జాతర ఒకటి. ఈ వేడుకను గొల్లగట్టు జాతర లేదా లింగమంతుల స్వామి జాతర అని కూడా వ్యవహరిస్తారు.  సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ఈ వేడుక ప్రాచుర్యం పొందింది.

భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాదవ (గొల్ల) సామాజిక వర్గం జరుపుకునే ఆధ్యాత్మిక ఉత్సవాల్లో లింగమంతుల స్వామి జాతర అత్యంత ప్రధానమైంది. యాదవుల ఆచార వ్యవహారాలు, జీవన విధానం, సాంస్కృతిక మూలాలకు, సంప్రదాయాలకు ఈ జాతర నిలువుటద్దంలా నిలుస్తుంది. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998లో లింగమంతుల స్వామి జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది.

దురాజ్‌పల్లి గుట్టపైనే కొలువైన స్వామి

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సుమారు హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో దురాజ్‌పల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలోని పాలశేర్లయ్యగట్టు అనే గొల్లగట్టుపైన ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ యాదవుల కులదైవంగా భావించే లింగమంతుల స్వామి పూజలందుకుంటారు. స్వామివారితోపాటు చౌడమ్మ దేవతను కూడా భక్తులు కొలుస్తారు.

పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ సాంప్రదాయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జరగని  సంవత్సరంలో ఈ లింగమంతుల స్వామి వేడుకను నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఒక ప్రత్యేక ఆచారం.

మహాశివరాత్రికి ముందు మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు జాతర కొనసాగుతుంది. ఈ రోజుల్లో గుట్ట పరిసరాలు భక్తులతో కిటకిటలాడటమే కాదు.. ‘ఓ లింగ.. ఓ లింగా’ అనే నామస్మరణతో మారుమోగుతాయి.

శివుడి చెమట చుక్కతో చౌడమ్మ జన్మించిందా?

పెద్దగట్టు జాతర వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒక పురాణగాథ ప్రకారం.. అమృత మథనం సమయంలో దేవతలు, అసురుల మధ్య జరిగిన పోరులో రాక్షసులను సంహరించేందుకు శివుడు రంగంలోకి దిగాడట. అయితే ప్రతి రాక్షసుడి రక్తపు చుక్క నేలపై పడగానే మరో అసురుడు పుట్టుకొచ్చేవాడని కథనం. అసుర సంహారం చేస్తూ శివుడు దురాజుపల్లి పెద్దగట్టుకు చేరుకున్న సమయంలో అలసటతో ఆయన శరీరం నుంచి జారిన చెమట చుక్క గుట్టపై పడిందని, ఆ చుక్క నుంచే చౌడమ్మ దేవి ఆవిర్భవించిందని స్థానిక విశ్వాసం. రాక్షసుల రక్తం నేలపై పడకుండా తానే స్వీకరిస్తానని చౌడమ్మ చెప్పడంతో శివుడి అసుర సంహారం పూర్తయిందని ఈ గాథ చెబుతుంది. తర్వాత తన ఆకలి తీర్చుకునే మార్గాన్ని చూపాలని చౌడమ్మ కోరగా, తనకు రక్త, మాంసాహారాలను నివేదించేందుకు శివుడు అనుమతించాడని భక్తుల నమ్మకం. ఈ విశ్వాసమే పెద్దగట్టు జాతరలో కొనసాగుతున్న కొన్ని ప్రత్యేక ఆచారాలకు మూలంగా చెబుతారు.

మరో కథలో.. బావిలోకి చేరిన విగ్రహాలు

పెద్దగట్టు ఆలయానికి సంబంధించి మరో స్థానిక కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి గర్భిణీ మహిళ గుట్టపై ఉన్న ఆలయానికి వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి మరణించిందని చెబుతారు. ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె భర్త అక్కడి విగ్రహాలను బావిలో పడేశాడట. ఆ తర్వాత గుట్టకు పశువులను మేపేందుకు వెళ్లిన గొర్ల, మెంతెబోయిన వంశాలకు చెందిన కొందరికి స్వామి కలలో కనిపించి.. బావిలో ఉన్న విగ్రహాలను వెలికి తీసి గుట్టపైన ప్రతిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చేలా చూడాలని ఆదేశించాడని స్థానిక కథనం. ఆ కల ఆధారంగా విగ్రహాలను బయటకు తీసి ప్రతిష్ఠించిన అనంతరం పూజలు ప్రారంభమయ్యాయని, క్రమంగా అదే జాతర సంప్రదాయంగా మారిందని చెబుతారు.

దిష్టిపూజతో మొదలయ్యే జాతర సందడి

జాతరకు ముందు నిర్వహించే కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడతారు. అంతకుముందే దిష్టిపూజ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం నుంచి 36 విగ్రహాలతో కూడిన దేవరపెట్టెను తీసుకొచ్చి సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉంచుతారు. అక్కడి నుంచి దురాజుపల్లి గుట్టకు దేవరపెట్టెను తీసుకెళ్లడంతో జాతర వాతావరణం మొదలవుతుంది.

పెద్దగట్టు పూజా కార్యక్రమాల్లో గొర్ల, మెంతెబోయిన, మున్నా వంశస్థులకు ప్రత్యేక పాత్ర ఉంటుంది. పూజకు అవసరమైన పసుపు, కుంకుమ, పాలు, నెయ్యితో పాటు తల్లి–పిల్ల పొట్టేళ్లను తీసుకుని, దేవరపెట్టెను వెంటబెట్టుకుని వారు గుట్టవైపు పాదయాత్రగా బయలుదేరుతారు. బోనాలు సమర్పించి, కొత్త కుండల్లో బియ్యం వండి స్వామివారికి, అమ్మవారికి నివేదిస్తారు.

ప్రత్యేక పూజల్లో భాగంగా మూడు గొర్రెలను బలి ఇచ్చి వాటి మాంసంతో అన్నాన్ని తయారు చేసి చౌడమ్మకు సమర్పించే ఆచారం కూడా ఉందని స్థానిక సంప్రదాయం చెబుతుంది. నెయ్యితో కలిపిన అన్నం, మాంసాన్ని మెంతెబోయిన వంశానికి చెందిన ఐదుగురు పెద్దలు మాత్రమే స్వీకరించడం ఈ వేడుకలోని మరో ప్రత్యేకతగా చెబుతారు. మున్నా వంశస్థులు కూడా తమ సంప్రదాయంలో భాగంగా గొర్రె రక్తాన్ని పాలలో కలిపి ప్రసాదంగా స్వీకరిస్తారని స్థానిక కథనాలు పేర్కొంటాయి.

ఇలాంటి ఆచారాలను పాటించే వారు జాతర అనంతరం కొంతకాలం మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండటం కూడా సంప్రదాయంలో భాగంగా చెబుతారు. యాదవుల జీవన విధానంలో పశువులకు ఉన్న ప్రాధాన్యం కూడా ఈ జాతరలో ప్రతిఫలిస్తుంది. తమ కులదైవమైన లింగమంతుల స్వామి పశువులను కాపాడి చల్లగా చూస్తాడనే విశ్వాసం భక్తుల్లో బలంగా ఉంది.

ఐదు రోజులు.. ఐదు ప్రత్యేకతలు

పెద్దగట్టు జాతర మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతి రోజూ ప్రత్యేకమైన పూజలు, ఆచారాలు ఉంటాయి.

తొలి రోజు.. గంపల సందడి

జాతర ప్రారంభ రోజున గంపల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. భక్తులు తమ ఇళ్లలో గంపలను సిద్ధం చేసుకుని వాటిని బయటకు తీసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సంప్రదాయ ఆయుధాలతో గుడి చుట్టూ గంపలతో ప్రదక్షిణలు చేస్తారు. ఈ కార్యక్రమం యాదవుల సంప్రదాయ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.

రెండో రోజు.. బోనాల సమర్పణ

రెండో రోజు యాదవ పూజారులు ప్రత్యేక అలంకరణలు పూర్తి చేసి బోనం సిద్ధం చేస్తారు. పోలు ముంతలు, బొట్లు, కంకణాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. చౌడమ్మ తల్లికి వర్ధ గొర్రె, తల్లి గొర్రె, బద్దేపాల గొర్రెతో పాటు బోనాలను సమర్పించడం ఈ రోజున జరిగే ప్రత్యేక ఆచారాల్లో ఒకటి.

మూడో రోజు.. స్వామివారి కల్యాణం

మూడో రోజు లింగమంతుల స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చంద్రపట్నం వేయడం సంప్రదాయం. బియ్యపు పిండి, పసుపుతో ప్రత్యేకంగా ముగ్గులు వేసి వాటి నాలుగు వైపులా ముంత గురుగులు ఏర్పాటు చేసి దీపాలు వెలిగిస్తారు. ఈ రోజున దేవరపెట్టెను కూడా ప్రత్యేక పూజల మధ్య ప్రతిష్ఠిస్తారు.

నాలుగో రోజు.. పాలు, బోనం, మాంసాహార నివేదన

నాలుగో రోజు కేసారం నుంచి తీసుకొచ్చిన పాలతో రెండు కొత్త బోనం కుండల్లో పొంగలి తయారు చేస్తారు. అనంతరం అక్కడి ఆచారాలకు అనుగుణంగా మాంసాహార వంటకాలు తయారు చేసి భక్తులు స్వీకరిస్తారు. దిష్టిపూజ సమయంలో ప్రతిష్ఠించిన దేవరపెట్టెను ఈ రోజున తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తరలిస్తారు. తదుపరి జాతర సమయంలో మళ్లీ తీసుకొచ్చేలా దానిని అక్కడ భద్రపరుస్తారు.

ఐదో రోజు.. ముగింపుకు చేరే మహోత్సవం

జాతర చివరి రోజున మూలవిరాట్ అలంకరణలో ఉపయోగించే మకర తోరణాన్ని తొలగించడంతో ప్రధాన వేడుకలు ముగింపు దశకు చేరుతాయి. ఐదు రోజుల పాటు ‘శంభు లింగా’ అంటూ స్వామివారిని కొలిచిన భక్తులు, పూజారులు తమ తమ గ్రామాల వైపు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. అయితే వారి వెంట తీసుకెళ్లేది కేవలం జాతర జ్ఞాపకం మాత్రమే కాదు.. తమ కులదైవంపై ఉన్న విశ్వాసం, తరతరాలుగా కొనసాగుతున్న ఆచారాల పట్ల ఉన్న అనుబంధం.

యాదవుల జీవన సంస్కృతికి ప్రతిబింబం

పెద్దగట్టు జాతరను కేవలం ఒక మతపరమైన ఉత్సవంగా మాత్రమే చూడలేం. యాదవ సమాజపు కులదైవ ఆరాధన, పశుపోషణతో ముడిపడిన నమ్మకాలు, వంశపారంపర్య పూజా పద్ధతులు, బోనాల సంప్రదాయం, దేవరపెట్టెకు ఉన్న ప్రాధాన్యం.. ఇలా అనేక అంశాలు ఈ జాతరలో కలిసిపోతాయి. అందుకే దురాజుపల్లి పెద్దగట్టు ప్రతి జాతర సమయంలో ఒక పండుగ ప్రదేశంగా మాత్రమే కాకుండా.. యాదవుల తరతరాల సాంస్కృతిక జ్ఞాపకాలను మోసుకొచ్చే ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపిస్తుంది. ‘ఓ లింగ.. ఓ లింగా’ అంటూ గుట్టంతా మారుమోగే నామస్మరణతో ఐదు రోజుల వేడుక ముగిసినా, ఈ జాతర వెనుక ఉన్న విశ్వాసాలు, ఆచారాలు, స్థలపురాణాలు మాత్రం తరతరాలకు కొనసాగుతూనే ఉంటాయి.