

దేశంలో చరిత్రకు సాక్ష్యంగా నిలిచే వందల ఏండ్ల నాటి చారిత్రక కట్టడాలు, వారసత్వ భవనాలు, పర్యాటక ప్రాంతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే, శతాబ్దాల కాలాన్ని దాటి చరిత్రకు సాక్ష్యంగా ఇప్పటికీ సజీవంగా, పచ్చని విస్తీర్ణంతో నిలిచిన మహావృక్షాలు మాత్రం యావత్ ప్రపంచంలోనే అరుదుగానే కనిపిస్తాయి. అటువంటి అరుదైన ఘనతను సొంతం చేసుకుని, తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది మహబూబ్‌నగర్ జిల్లాలోని ‘పిల్లలమర్రి’.
పాలమూరు పేరు వినగానే..
మహబూబ్‌నగర్.. పాలమూరు.. ఈ పేర్లు వినగానే గుర్తొచ్చే ప్రకృతి అద్భుతాల్లో పిల్లలమర్రి ముందుంటుంది. మహబూబ్‌నగర్ నగరానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో విస్తరించిన ఈ మహావృక్షానికి 750 ఏళ్ల చరిత్ర ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. సుమారు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిన్న వనంలా వ్యాపించి ఉన్న పిల్లలమర్రిని దూరం నుంచి చూస్తే చిన్న కొండలా కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అనేక కొమ్మలు, ఊడలతో విస్తరించిన పచ్చని పందిరి.. వేలాది మందికి ఒకేసారి నీడనిచ్చే భారీ గొడుగును తలపిస్తుంది. ఇంత విస్తారంగా పెరిగిన కారణంగా అసలు ఈ చెట్టు ప్రధాన కాండం ఎక్కడ మొదలైందో గుర్తించడం కూడా కష్టమే.
‘పిల్లలమర్రి’ అనే పేరు ఎందుకు?
మర్రిచెట్టు కొమ్మల నుంచి ఊడలు కిందికి పెరిగి నేలను చేరుతాయి. అక్కడ అవి వేర్లుగా బలపడి కొత్త కాండాల రూపంలో పైకి ఎదుగుతాయి. ఇలా ప్రధాన కాండం చుట్టూ చిన్న చిన్న కాండాలు పిల్లల్లా విస్తరించడంతో ఈ మహావృక్షానికి ‘పిల్లలమర్రి’ అనే పేరు వచ్చిందని చెబుతారు. కాలం గడిచేకొద్దీ ఈ ఊడల సంఖ్య పెరిగి, చెట్టు విస్తీర్ణం కూడా విస్తరిస్తూ వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని శతాబ్దాలుగా నిలబడిన ఈ మర్రిమాను.. ఈరోజు ఒక మహావృక్షంగా మారింది.
పాలమూరు యూనివర్సిటీ లోగోలోనూ స్థానం
పిల్లలమర్రికి పాలమూరు ప్రజలతో ఉన్న అనుబంధానికి మరో ఉదాహరణ పాలమూరు యూనివర్సిటీ లోగో. విశ్వవిద్యాలయ చిహ్నంలో ఈ మహావృక్షానికి స్థానం కల్పించడం ద్వారా ప్రకృతి, పర్యావరణం, స్థానిక వృక్ష సంపదకు ఈ ప్రాంత ప్రజలు ఇచ్చే ప్రాధాన్యాన్ని ప్రతిబింబించారు. అంటే పిల్లలమర్రి కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు.. పాలమూరు ప్రాంతీయ గుర్తింపులోనూ భాగమైపోయింది.
అంతరించే దశ నుంచి.. మళ్లీ జీవం
ఇంతటి విశాలమైన మహావృక్షానికీ కొన్నేళ్ల క్రితం గడ్డు పరిస్థితి ఎదురైంది. చెదలు, తెగుళ్ల ప్రభావంతో పిల్లలమర్రి తీవ్రంగా దెబ్బతింది. కొమ్మలు బలహీనపడటం, కొన్ని ఊడలు ఎండిపోవడం, ఆకులు రాలిపోవడంతో ఒకప్పుడు పచ్చని పందిరిలా కనిపించిన చెట్టు కళ కోల్పోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ అరుదైన వృక్షం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. నాటి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) విక్టర్ నేతృత్వంలోని అటవీ శాఖ బృందం ఒక వినూత్న ఉపాయాన్ని ఆలోచించారు. చెట్టు కాండాల్లోకి నేరుగా ద్రవాన్ని పంపడానికి ఆసుపత్రుల్లో వాడే సలైన్ బాటిళ్లు, ఐవీ డ్రిప్ సెట్లను (IV Drip Sets) ఉపయోగించాలని నిర్ణయించారు. భారీ మర్రిచెట్టు ఊడలకు చెదలు పట్టిన ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక చికిత్స అందించారు. సెలైన్ బాటిళ్లను ఉపయోగించి క్లోరోపైరిఫాస్ ద్రావణాన్ని అందించారు. ఊడలు నేలను తాకి వేర్లుగా మారితేనే చెట్టు మరింత బలపడుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఊడలు నేరుగా భూమిని చేరేలా పీవీసీ పైపులను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కూడా అవసరమైన చికిత్సను అందించారు. చెదలతో బలహీనమైన కొమ్మలు, ఊడలు విరిగిపోకుండా వాటికి ఆధారంగా పిల్లర్లను నిర్మించారు. ఇవే కాకుండా శాస్త్రీయంగా అందించిన మరికొన్ని చర్యలతో నూతన ఊడలు రావడం మొదలైంది. బలహీనపడిన భాగాలు పుంజుకున్నాయి. పిల్లలమర్రి మళ్లీ పచ్చదనాన్ని సంతరించుకుంది.
ప్రపంచం మొచ్చిన ప్రయత్నం
పాలమూరు పిల్లలమర్రికి అందించిన 'సలైన్ డ్రిప్ ట్రీట్మెంట్' ప్రపంచ పర్యావరణ సంరక్షణ చరిత్రలోనే ఒక వినూత్న అధ్యాయంగా నిలిచింది. మనుషులకు ప్రాణాపాయ స్థితిలో గ్లూకోజ్ బాటిళ్లు ఎక్కించినట్లే, 700 ఏళ్ల నాటి మర్రి చెట్టును రక్షించేందుకు సలైన్ బాటిళ్ల ద్వారా క్రిమిసంహారక మందులను ఎక్కించడం ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ప్రాచుర్యం పొందింది. ఈ వినూత్న ప్రయోగంపై అప్పట్లో BBC, CNN, The Guardian, Reuters వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పత్రికలు, ఛానళ్లలో ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. "సలైన్ బాటిళ్లతో ప్రాణం పోసుకుంటున్న 700 ఏళ్ల వృక్షం" అంటూ విదేశీ పర్యావరణ వేత్తలు తెలంగాణ అటవీ శాఖ ప్రయోగాన్ని ప్రశంసించారు.
పర్యాటక ప్రపంచం
పిల్లలమర్రిని చూడటానికి వచ్చే పర్యాటకుల కోసం ఈ ప్రాంతంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఇక్కడ జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, అక్వేరియం ఉన్నాయి. పిల్లలమర్రి మ్యూజియానికి కూడా చారిత్రక నేపథ్యం ఉంది. 1976లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దీనిని ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పురావస్తు తవ్వకాల సందర్భంగా వెలుగులోకి వచ్చిన శిల్పాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారు.
మరో ఆకర్షణ శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయం
పిల్లలమర్రి ప్రాంగణంలో మరో ప్రత్యేక ఆకర్షణ శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయం. శ్రీశైలం ప్రాజెక్టు ముంపునకు గురైన కృష్ణా నది తీరంలోని ఈర్లదిన్నె గ్రామం నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి, 1981లో పాలరాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు.
పాలమూరులో మర్రి.. ఓ సంస్కృతికి ప్రతీక
పాలమూరు గ్రామీణ జీవనంలో మర్రిచెట్టు కేవలం పచ్చదనాన్ని అందించే వృక్షం కాదు. అది సామాజిక, సాంస్కృతిక జీవితంతోనూ ముడిపడి ఉంటుంది. గ్రామాల్లో దేవాలయాల ప్రాంగణాల్లో మర్రి, రావి, వేప వంటి వృక్షాలకు ప్రత్యేక స్థానం కనిపిస్తుంది. అప్పన్నపల్లి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణం, నవాబ్‌పేట మండలంలోని పోమాల్, కొత్తపల్లి ప్రాంతాల్లోని విశాలమైన వృక్షాలు కూడా ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. అమరచింత మండలంలోని సింగంపేట బాట ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న మరో మహావృక్షం కూడా తరతరాలుగా నిలిచినదిగా స్థానికులు చెబుతారు. దీనికి 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని స్థానికంగా ప్రచారం ఉంది. అదే విధంగా ఏనుగొండ, కోయిలకొండ మండలంలోని ఆచార్యపూర్ వీరభద్రాలయం, జడ్చర్ల బూరెడ్డిపల్లి పరిసరాల్లోనూ వందల ఏళ్ల నాటి మర్రిమానులు ఉన్నట్లు స్థానిక వివరాలు పేర్కొంటున్నాయి.
మర్రి..జాతీయ వృక్షం
మర్రి వృక్షానికి భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆధ్యాత్మిక విశ్వాసాల నుంచి గ్రామీణ జీవన విధానం వరకు.. అనేక సందర్భాల్లో మర్రిచెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. అందుకే మర్రిని జాతీయ వృక్షంగా ప్రకటించారు. పర్యావరణ పరంగా చూస్తే కూడా ఇది అనేక జీవరాశులకు ఆశ్రయం కల్పించే వృక్షం. పక్షులు, చిన్న జీవులు, కీటకాలు వంటి వాటికి మర్రిచెట్టు ఆవాసంగా ఉపయోగపడుతుంది. విస్తారమైన ఆకులు, కొమ్మల కారణంగా దాని పరిసరాల్లో చల్లని వాతావరణం ఏర్పడుతుంది. మర్రి చెట్టుకు ఆయుర్వేదంలోనూ ప్రాధాన్యం ఉంది. బెరడు, ఆకులు, మర్రిపాలు, పండ్లు సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించినట్లు పేర్కొంటారు. ముఖ్యంగా మర్రిపాలను కొన్ని సంప్రదాయ చికిత్సల్లో ఉపయోగించే ఆనవాయితీ ఉంది.