

ప్రభాత ఉదయం, నల్లగొండ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. గురువారం నల్లగొండలో ప్రారంభమైన పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ఆరవ కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పలుమార్లు శాసనమండలిలో ప్రస్తావించడంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో తనతోపాటు మరో ఉద్యమ గొంతుక ఉండాలనే ఉద్దేశంతో నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ పోటీ చేస్తారని ప్రకటించారు.
72 వేల మందికి పైగా సభ్యత్వం
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి. దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 72 వేల మందికి పైగా సభ్యత్వం కలిగిన ఏకైక ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ అని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సుంకరి భిక్షం గౌడ్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డికి, రాష్ట్ర సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, సంఘం అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్ గుప్తా, జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణరెడ్డి, కార్యదర్శి మేకల జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.