వర్సిటీలో ఎక్స్ పో.. ఓఆర్ఆర్‌పై స్టంట్లు

హసన్‌పర్తి ప్రైవేట్ యూనివర్సిటీలో బైక్ స్టంట్ల వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Bike stunts on ORR
Hasanparthy Private University Students Performing Bike Stunts On ORR
Published on: 

వర్ధన్నపేట, ప్రభాత ఉదయం: విద్యార్థులకు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత నేర్పించాల్సిన ఓ యూనివర్సిటీ ప్రమాదకర విన్యాసాలకు వేదికగా మారింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల శివారులోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బైక్ స్టంట్లు, కార్ రేసుల మధ్య నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు వివాదాస్పదమయ్యాయి. కళాశాల విద్యార్థులు ఓఆర్ఆర్‌పై విన్యాసాలు చేయడం, ఇతర వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడటంపై విమర్శలు వస్తున్నాయి. వర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘అశ్వవేగ ఆటో ఎక్స్ పో 2.0’ పేరుతో బైక్‌లు, కార్ల ప్రదర్శన నిర్వహించారు. అదే సమయంలో నంబర్ ప్లేట్లు లేని బైకులు, కార్లతో కొందరు విద్యార్థులు విన్యాసాలు చేశారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో యూనివర్సిటీ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అటు వేడుకలు.. ఇటు రేసింగ్‌

యూనివర్సిటీలో నూతన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు నిర్వహించే ఫ్రెషర్స్‌ డే వేడుకలు ఆహ్లాదకర వాతావరణం మధ్య సాగాలి. కానీ, కొందరు విద్యార్థుల చర్యలు తోటి విద్యార్థులతోపాటు ఓఆర్ఆర్‌పై వాహనదారుల భద్రతకు ముప్పుగా మారింది. స్టంట్లు చేసే క్రమంలో ఓ విద్యార్థి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ‘రోడ్లపై బైక్‌ స్టంట్లు, కార్ రేసింగ్‌లు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు చేపడతాం. ఇటీవల జాతీయ రహదారిపై బైక్‌ స్టంట్లు చేసిన కొందరిపై కేసులు నమోదు చేశాం. జాతీయ రహదారులపై ప్రమాదకర విన్యాసాలు చేస్తే ఉపేక్షించం’ అని హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్‌ ఏ మహేందర్‌ హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనపై యూనివర్సిటీ ఇప్పటివరకు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.