ప్రభాత ఉదయం ప్రతినిధి, సంగారెడ్డి: బాధ్యతాయుతంగా పనిచేయని ఉద్యోగులపై చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సంగారెడ్డి జడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ రెవెన్యూ, రిజిస్ర్టేషన్, హౌసింగ్ శాఖల పనితీరుపై కలెక్టర్లు, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకట్ స్వామితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు. భూ సర్వే నిర్వహణకు సంబంధించి పలువురు తహసీల్దార్లు, సర్వేయర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సర్వే సమయంలో సంబంధిత రైతుకు తన భూమి విస్తీర్ణం స్పష్టంగా చెప్పాలని సూచించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాదీ ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలనే లక్ష్యం చేరుకోవాలన్నారు. తొలి దశలో ప్రతీ జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందని ఆ గ్రామాల్లో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కల సాకారమయ్యే వరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
మంత్రి దృష్టికి సమస్యలు
సమీక్షకు ముందు జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులకు సంబంధించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత జిల్లాల కలెక్టర్లకు మంత్రి పలు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు అందించిన సలహాలు, సూచనలను మంత్రి పొంగులేటి స్వీకరించారు. ఈ సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేశ్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, కలెక్టర్లు ప్రతీక్ జైన్, హైమావతి, ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.