ఏడాదిలోపే ఇందిర‌మ్మ ఇండ్ల ట‌వ‌ర్స్‌

Indiramma Housing Towers
Ponguleti srinivasa reddy laid foundation stone for Indiramma housing towers
Published on: 
  • వేగంగా పూర్తి చేస్తే కాంట్రాక్టర్లకు నజరానా

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

  • గాజులరామారంలో ఇండ్లకు శంకుస్థాపన

  • 5,128 మంది అర్హులు.. 480 మందికి కేటాయింపు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, ప్రభాత ఉదయం: క్యూర్ పరిధిలో మొదటి దశ ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న లక్ష ఇందిరమ్మ ఇండ్లను ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పలువురు లబ్ధిదారులతో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు 23 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ను నిరంతర ప్రక్రియగా పూర్తి చేస్తామని తెలిపారు. నెల ముందుగా పూర్తి చేసే కాంట్రాక్టర్లకు రూ. 45లక్షలు, రెండు నెలల ముందుగా పూర్తి చేస్తే రూ. 90లక్షలు ప్రోత్సాహకంగా అందజేస్తామని చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇండ్ల కోసం 7వేల దరఖాస్తులు రాగా, 5,218మంది అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇందులో బహిరంగంగా లక్కీ డ్రా ద్వారా 480మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ దఫాలోనే కాకుండా మరో మూడు దశల్లో ఇండ్ల నిర్మాణం చేపడుతామని వివరించారు. ప్రస్తుతం సుమారు 7.5 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నదని, మరికొంత భూమి కోసం గృహనిర్మాణ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, హౌసింగ్ శాఖ సెక్రటరీ వీపీ గౌతమ్, కలెక్టర్ మనూ చౌదరి పాల్గొన్నారు.