

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎంత మంది విదేశీయుల ఓట్లను తొలగించారో చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ఓట్లను తొలగించి, ఎంతమంది విదేశీయులను వారివారి దేశాలకు సాగనంపారో స్పష్టమైన ఆధారాలతో బయటపెట్టాలని ఆయన కోరారు. సోమవారం హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్‌పై అమిత్‌షా చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ మంత్రి పొన్నం ఓ ప్రకటన విడుదల చేశారు. చొరబాటుదారులూ ఓటు హక్కును పొందగలుగుతున్నారంటే, దీనిపై దేశ హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పది సార్లు ఎస్ఐఆర్ను నిర్వహించినా అర్హుల ఓట్లను తొలగించలేదని గుర్తుచేశారు.
తెలంగాణకు సత్వర సాయం చేయాలి
ఓట్ల తొలగింపు ఫారాల పంపిణీ ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాల నుంచి జరుగుతోందనే ప్రచారంపై హోంమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్ల తొలగింపుపైనే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందన్నారు. దొంగల్లా దొరికిపోయి, ఇప్పుడు పాదయాత్రల పేరుతో బుకాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ విమర్శలు మానేసి, కరువు బారిన పడిన తెలంగాణకు సత్వర ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్‌ను విమర్శించడానికే పరిమితమైందని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు, రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడకుండా రాజకీయ విమర్శలు చేయడాన్నే అమిత్‌షా లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు.