విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటాం: పొన్నం ప్రభాకర్‌

సంగారెడ్డి జిల్లా నందిగామలో నూతనంగా నిర్మించిన గౌడ హాస్టల్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రారంభించారు. విద్యార్థులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Goud Hostel Inauguration In Nandigama
Goud Hostel Inauguration In Nandigama By Ponnam Prbahakar, Mahesh Kumar Goud
Published on: 

ప్రభాత ఉదయం ప్రతినిధి, సంగారెడ్డి: గౌడ సత్రాలు, హాస్టళ్ల నిర్మాణంతో విద్యార్థులకు అండగా నిలవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామలో నూతనంగా నిర్మించిన గౌడ హాస్టల్‌ భవనాన్ని శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఉన్నత లక్ష్యాలతో రాణించాలి

హాస్టల్‌ నిర్మాణానికి సహకరించిన దాతలు, నిర్వాహకులు, గౌడ సంఘం ప్రతినిధులను మంత్రి అభినందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌, కరీంనగర్‌లో గౌడ హాస్టళ్లను నిర్మించుకున్నామని తెలిపారు. వేములవాడ, కొమురవెల్లి, జోగులాంబ ప్రాంతాల్లోనూ త్వరలో గౌడ సత్రాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన సహకారం అందిస్తామని వెల్లడించారు.

పేద విద్యార్థులను ప్రోత్సహించాలి

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలని, వారు అన్ని రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. హాస్టళ్లు, వసతి గృహాలు, సత్రాల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా స్థిరపడిన వారు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, గౌడ హాస్టల్స్‌ అధ్యక్షుడు చక్రవర్తి గౌడ్‌, తుళ్ల వీరేందర్‌గౌడ్‌, కాట శ్రీనివాస్‌గౌడ్‌, గీత కార్పొరేషన్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.