

ప్రభాత ఉదయం, హుస్నాబాద్ : కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్‌లను కరువు మండలాలుగా ప్రకటించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎంకు లేఖ రాశారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ రెండు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ‘‘నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే రెండు మండలాలను కరువు మండలాలుగా గుర్తించింది. మిగిలిన ఐదు మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి నాటికి తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉన్నది. తమ ప్రాంతాలను కరువు మండలాల జాబితాలో చేర్చాలని ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. రైతులు, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ రెండు మండలాలను వెంటనే కరువు ప్రాంతాలుగా గుర్తించాలి” అని లేఖలో పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.