ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచాలి : దామోదర్ రాజనర్సింహ

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంఆర్‌ఐ సేవలను విస్తరించేందుకు పీపీపీ విధానం అమలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
Damodar Rajanarsimha reviewing plans to expand free MRI services in government hospitals
మంత్రి దామోదర్ రాజనర్సింహ
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ :  ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు మెరుగుపరచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎంఆర్‌ఐ సేవల విస్తరణ కోసం పీపీపీ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కోఠిలోని టీజీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ విధానాన్ని తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆ అనుభవంతో రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని జీజీహెచ్‌లలో ఈ సేవలను విస్తరించాలని సూచించారు.

పీపీపీ పద్ధతిలో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి వచ్చినా పేషెంట్లకు ఎలాంటి రుసుము ఉండదని, ఈ పరీక్షలన్నీ పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, భూపాలపల్లి ఆసుపత్రులలో మాత్రమే ఈ సదుపాయం ఉంది. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ ప్రాంతాలలో ఈ సేవలు అందుబాటులో లేవు. యంత్రాల కొనుగోలు ఖర్చు, నిర్వహణ సమస్యల వల్ల రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులు తొలగించేందుకు తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల విధానాలపై అధికారులు ప్రత్యేక అధ్యయనం చేశారు. ఈ కొత్త విధానం అమలుతో ప్రభుత్వానికి సుమారు ఇరవై శాతం మేర ఆర్థిక భారం తగ్గుతుంది. యంత్రాల నిర్వహణ సమస్యలు తీరుతాయి. రోగులకు నిరంతరం నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి.