కేటీఆర్ ప్రారంభించిన పైలాన్ తొలగింపు.. రామగుండంలో రాజకీయ దుమారం

రామగుండంలో పైలాన్ తొలగింపుపై బీఆర్‌ఎస్ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
BRS leaders protesting the removal of a pylon during road widening work in Ramagundam
రామగుండంలో పైలాన్ తొలగింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
Published on: 

ప్రభాత ఉదయం, రామగుండం:  రామగుండం రాజకీయం రచ్చకెక్కింది. రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన పైలాన్ తొలగింపు వ్యవహారం అధికార, ప్రతిపక్ష బీఆర్​ఎస్​ మధ్య వివాదానికి తెరలేపింది. బీఆర్​ఎస్​ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్​ తొలగింపు దుమారం రేపింది. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టాయి. పైలాన్​ తొలగింపును అడ్డుకునేందుకు జేసీబీకి అడ్డుగా బైఠాయించారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే మక్కాన్​ సింగ్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పైలాన్​ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని.. అభివృద్ధి పనులకు గుర్తుగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను కాపాడాలని డిమాండ్​ చేశారు. మక్కాన్​ సింగ్​ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి చిరువ్యాపారులు రోడ్డు పడ్డారని.. ఆలయాలను కూల్చేస్తున్నారని ఆరోపించారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కోరుకంటి చందర్​తో పాటు పలువురు బీఆర్​ఎస్​ నాయకులను అరెస్ట్​ చేసి గోదావరిఖని ఠాణాకు తరలించారు. కాగా జేసీబీ డ్రైవర్​పై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే తీరుపై అధికారులు మండిపడ్డారు. జంక్షన్​ అభివృద్ధితో పాటు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న పైలాన్​ను మరో చోటుకు తరలిచేందుకు తొలగించామని రామగుండం మేయర్​ మహంకాళి స్వామి చెప్పారు. వాస్తవాలు అర్థం చేసుకోకుండా దాడులకు పాల్పడిన బీఆర్​ఎస్​ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసలను కోరారు.