రియల్ ఎస్టేట్ వ్యాపారిలా సీఎం రేవంత్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు

మియాపూర్ భూములను వేలం వేసే నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని ఎన్. రాంచందర్‌రావు తెలిపారు. ఒక్క అంగుళం భూమి అన్యాక్రాంతమైనా అడ్డుకుంటామని హెచ్చరించారు.
BJP Telangana president N Ramchander Rao
మియాపూర్ 550 ఎకరాల భూముల వేలం ప్రతిపాదనపై మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ‘‘సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తూ, వేలం పేరుతో విలువైన భూములను తమ అనుచరులకే కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూములపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ  భూములను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ బంధువులకు కట్టబెట్టాలని చూస్తే, అప్పట్లో రేవంత్‌రెడ్డి తానే కాజేయాలని చూశారన్నారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ భూములను వేలం వేసి అమ్మేస్తామని ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ‘‘మియాపూర్ భూముల్లో ఒక్క అంగుళం స్థలం అన్యాక్రాంతమైనా బీజేపీ చూస్తూ ఊరుకోదు, కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ఈ అమ్మకాల దోపిడీని ప్రజలతో కలిసి అడ్డుకుంటాం’’ అని  ఆయన హెచ్చరించారు.