బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి రానివ్వం : సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు తెలంగాణలో బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దానం నాగేందరే కాంగ్రెస్ అభ్యర్థి అని ప్రకటించారు.
CM Revanth Reddy
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్​ను అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ‘రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణను దోచేశారు, ఉద్యమం పేరుతో కేసీఆర్​ ఎంతో మంది అమాయక పిల్లలను చంపారు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాపం కేసీఆర్​ను అనునిత్యం వెంటాడుతూనే ఉంటుందన్నారు. ఆయన అరాచకానికి పకృతి తప్పకుండా శిక్షిస్తుందని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి బీఆర్ఎస్​ ఓడిపోవడానికి ప్రకృతి తన పని తాను చేస్తుందని తెలిపారు. ఖైరతాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి దానం నాగేందరే అని, ఆయనే ఉప ఎన్నికల బరిలో ఉంటారని స్పష్టం చేశారు. ఏ ఎన్నికలైనా చాలెంజ్​గా తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం మీడియాతో చిట్​ చాట్​ చేశారు.

‘తుమ్మిడిహెట్టి’ అంటే వారికి ఇష్టం లేదు

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంటే కేసీఆర్, కేటీఆర్​కు ఎంత మాత్రం ఇష్టం లేదని, పనులు ముందకు సాగడం వారికి కంటగింపుగా ఉందని రేవంత్​ అన్నారు. కృష్ణాపై నిర్మించిన ప్రాజెక్టులను ఎండబెట్టింది కేసీఆరేనని విమర్శించారు. తెలంగాణకు బుల్లెట్​ రైళ్లు రాకుండా, మెట్రో రైలు విస్తరణతో పాటు అప్పులు పుట్టకుండా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్​తో కలిసి తండ్రి, కొడుకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్​ చెప్పినట్లు రైల్వే మంత్రి నడుచుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం-బనకచర్ల లింకేజీకి ఆద్యుడు కేసీఆర్ అని, ప్రతిపాదించింది కూడా ఆయనే అని తెలిపారు. భద్రాచలం దిగువన ఉన్న జలాలను వాడుకోవాలని గతంలో ఉచిత సలహా ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై గతంలో కేసీఆర్​ చేసిన ప్రసంగాన్ని అసెంబ్లీలో విన్పించామని తెలిపారు. 65 కార్పొరేషన్ల నామినేటెడ్​ పదవులను ఒకే జీవోతో భర్తీ చేస్తున్నామని సీఎం రేవంత్​ చెప్పారు. ఈ పదవుల భర్తీలో అనుబంధ సంఘాల వారికి, పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా సీరియస్​గానే తీసుకుంటున్నామని, ఎన్నికలను తేలికగా తీసుకుంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్నారు. కాళేశ్వరం విషయంలో కేటీఆర్, హరీశ్​ రావు మెదడు లేనట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్​ కంటే తాను శ్రీమంతుడిని అని, చిన్ననాటి నుంచి తమ కుటుంబం ఆర్థికంగా బాగానే ఉందన్నారు. ‘నేను ప్లేన్​ పేపర్​ లాంటి వాడిని, ఎవరి కింద మంత్రిగా పని చేయలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్​ సభ్యులు రాకుండా తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కోర్​ ఇష్యూపై చర్చలు పెడితే అల్లరి చేసి బయటకు వెళ్తున్నారని, మళ్లీ చర్చలకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయాలకు, అభివృద్ధికి ఏనాడూ లింకు​ పెట్టనని రేవంత్​ రెడ్డి తెలిపారు.

ఎన్డీఎస్​ఏ సూచనలు పాటిస్తున్నాం

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సూచనల ప్రకారం పని చేస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ సమీక్ష చేస్తుందని, ప్రాజెక్టులను ప్రభుత్వ డబ్బుతో నిర్మించారని, నిపుణుల సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టూ కేంద్రం పరిధిలోకి రాదని, నిర్మాణం పూర్తయిన తరువాతే ఎన్డీఎస్ఏ పరిధిలోకి వస్తుందని తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల మరమ్మతులు ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని చెప్పారు. కేసీఆర్​ కుటుంబ సభ్యులంతా ఒకటేనని, పైకి విడిపోయినట్టు కనిపిస్తారని తెలిపారు. కేబీఆర్​ పార్కు వద్ద ట్రాఫిక్​ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం వన్​ వే పెట్టాం.. చివరికి ట్రాఫిక్​ సమస్యకు వన్​ వేనే పరిష్కారమైందన్నారు. బీఆర్ఎస్​ చేయలేకపోయిన పనులను తమ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. అవి ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సూచనతోనే మెట్రోను తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ఎల్​అండ్​టీతో ఒప్పందం చేసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ఇండియన్​ రైల్వే ఫైనాన్స్​ కార్పొరేషన్​ క్లియరెన్స్​ ఇచ్చిందని, ఇప్పుడు అప్పు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని రేవంత్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.