సిగ్నల్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి

సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ వ్యవస్థతో పాటు అవసరమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
Revanth Reddy
హైదరాబాద్ ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీటి పొదుపుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ రద్దీ లేని, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిచిపోకుండా ‘సిగ్నల్ ఫ్రీ’ వ్యవస్థను అమలు చేయాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలని ట్రై-కార్పొరేషన్ కమిషనర్లను ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం ఆయన మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి, పలు కీలక సూచనలు చేశారు.

అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు

నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తలెత్తకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలని చెప్పారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నిర్మాణ వ్యర్థాల(సీ అండ్‌ డీ వేస్ట్) తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో వ్యర్థాల తొలగింపు కోసం ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.   

తాగునీటి పొదుపునకు 'గ్రీన్ ట్యాంకర్లు'

పార్కుల అభివృద్ధి, ల్యాండ్‌స్కేపింగ్, భవన నిర్మాణ పనులకు తాగునీటిని వాడటం తగదని సీఎం చెప్పారు. వీటికి బదులుగా మురుగునీటి శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ) అందించే నీటిని వినియోగించాలన్నారు. దీనివల్ల తాగునీటిని ఆదా చేయవచ్చని చెప్పారు. ఇందులో భాగంగా మెట్రో వాటర్ సప్లై బోర్డు తొలి విడతగా 19 ఎస్టీపీల నుంచి 28 ‘గ్రీన్ వాటర్ ట్యాంకర్ల’ను అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోనూ ఈ విధానాన్ని మరింత విస్తరించాలని, ప్రజల్లో గ్రీన్ ట్యాంకర్లపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్, మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన తదితరులు పాల్గొన్నారు.