కొడంగల్‌లో 7 నుంచి మెగా రైతు మేళా

ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కొడంగల్‌లో రైతు మేళా నిర్వహిస్తున్నారు.
Thummala Nageswara Rao
తుమ్మల నాగేశ్వరరావు
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : కొడంగల్‌లో ఈ నెల 7 నుంచి 9వరకు మూడు రోజుల పాటు మెగా రైతు మేళాను నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మెగా రైతు మేళాను 7 తేదీన ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని ప్రదర్శించే లక్ష్యంతో ఈ మేళాను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మెగా రైతు మేళాలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఆయిల్‌ఫెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం,పశుసంవర్ధక శాఖ, బ్యాంకింగ్ సంస్థలు, విత్తన పరిశ్రమ సహా 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో 150 ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. వ్యవసాయ ఇన్‌పుట్స్, కొత్త రకం రసాయనాలు, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, వ్యవసాయ డ్రోన్లు, వివిధ శాఖల సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ కార్యక్రమాలను ఈ స్టాళ్ల ద్వారా రైతులకు వివరించనున్నట్లుగా తెలిపారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అవార్డు గ్రహీతలైన ప్రగతిశీల రైతులతో సాంకేతిక సమావేశాలు, ముఖాముఖి చర్చలు నిర్వహించనున్నారని చెప్పారు. తొలి రోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్, నారాయణపేట జిల్లాల నుంచి సుమారు 7,500 మంది రైతులు పాల్గొననున్నారని తెలిపారు. రెండోరోజు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళా రైతుల పాత్ర, ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వారికి అవగాహన కల్పించనున్నారని వివరించారు. మూడోరోజు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధు ప్రతినిధులు, సాంకేతిక సంస్థలతో నేరుగా చర్చించే అరుదైన అవకాశాన్ని ఈ మెగా రైతు మేళా కల్పిస్తుందని పేర్కొన్నారు.