

ప్రభాత ఉదయం, భైంస: మెడికల్ షాపు చిన్నదైనా, పెద్దదైనా అందులో ఫార్మాసిస్ట్ ఉండాలి. మందులు ఎలా వేసుకోవాలో రోగికి విడమర్చి చెప్పాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. రోగి శారీరక, మానసిక పరిస్థితిని బట్టే అవసరమైన మందులు ఇవ్వాలి. కానీ భైంసాతోపాటు ముధోల్ నియోజకవర్గంలో మెడికల్ షాపుల వ్యాపారం కిరాణ షాపుల్లా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ రాసిచ్చే చీటితో సంబంధం లేకుండా ఎవరడిగినా మందులు ఇచ్చేస్తున్నారు. డీ-ఫార్మసీ/ఎం-ఫార్మసీ సర్టిఫికెట్ ఉంటే చాలు.. మెడికల్ షాపు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు.
మీకు తలనొస్తోందా? జ్వరం వస్తోందా? కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులతో భరించలేకుండా ఉన్నారా? నిద్ర పట్టడంలేదా? ఏం భయం లేదు. ఆనారోగ్య సమస్యలపై డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదంటున్నారు భైంసాలోని మెడికల్ షాపుల నిర్వాహకులు. తలెత్తిన ఆనారోగ్యం గురించి చెబితే చాలు.. మెడికల్ షాపుల్లో అన్ని రకాల మందులు ఇచ్చేస్తున్నారు. ఎంత మొత్తంలో కావాలన్నా ఇస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమే లేదు. ఏ మందులు వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో.. ఎన్ని రోజులు వాడాలో కూడా మెడికల్ షాపుల నిర్వాహకులే చెప్పేస్తున్నారు.
అల్లోపతి మెడిసిన్ విచ్చలవిడి అమ్మకాలపై ఔషధ నియంత్రణ అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ఏళ్ల నుంచి తనిఖీలు చేయడంలేదు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఒంటినొప్పులు తదితర సమస్యలకు మెడికల్ షాపుల్లో అడగ్గానే మందులిస్తున్నారు. కార్డియాలజీ, సైకియాట్రిక్, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్, బీపీ, థైరాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ తదితర సమస్యలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదు. ఈ వ్యాధుల ఔషధాల్లో హై డోస్.. లో డోస్ అనే రకాలు ఉంటాయి. వ్యాధి తీవ్రత, రోగి వయసు, శరీరతత్వం తదితరాలను బట్టి డాక్టర్లు మెడిసిన్‌ను నిర్ణయిస్తారు. సాధారణంగా మెడికల్ షాపునకు వెళ్లి అడిగితే ఏ రోగానికైనా, ఎన్ని మందులు కావాలన్నా ఇచ్చేస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు కొందరు దగ్గుకు వాడే సిరప్లు తాగుతున్నారు. ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాలకు బానిసైనవారు అవి దొరకని సమయాల్లో మెడికల్ సిరప్లు వాడుతున్నారు. ఈ తరహా సిరప్లు డాక్టర్ రాసిస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ, కొన్ని మెడికల్ షాపుల్లో ఎవరెన్ని, ఏమి అడిగినా ఇచ్చేస్తున్నారు.
గడువు ముగిసినా మందుల అమ్మకం
డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులను అంటగడుతున్నారు. భైంసాలో 150కి పైగా రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపులున్నాయి. రోజూ ప్రతి చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.10 వేల నుంచి రూ.లక్షన్నర వ్యాపారం జరుగుతున్నది. అయినా డ్రగ్ ఇన్స్పెక్టర్ల అడ్రస్సే లేకుండా పోయింది. వారు ఎక్కడ ఉంటారో.. ఏ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అనేక షాపుల్లో కాలం చెల్లిన మందులు యథేచ్చగా అమ్ముతున్నారు. అర్హత, అనుభవం లేని వ్యక్తులు ఫార్మసిస్ట్ సర్టిఫికెట్లతో మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇష్టానుసారం మెడికల్ షాపులు నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడు కానరావడంలేదు.
లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది
భైంసాతోపాటు ముధోల్ సెగ్మెంట్లోని ఏడు మండలాల పరిధిలో మందుల షాపులు బినామీ వ్యక్తులే నిర్వహిస్తున్నారని సమాచారం. ప్రొఫెషనల్ ఫార్మసిస్ట్ ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితో మాత్రమే దుకాణాలను నిర్వహించాలి. కానీ, చాలామంది తక్కువ వేతనంతో యువకులను పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్‌పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఏడీలు మెడికల్ షాపుల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకొని నిబంధనలకు పాతరేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని మెడికల్ షాపులు, కెమిస్ట్ డ్రగిస్ట్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.