తాగునీటి ఏర్పాట్లకు ప్రత్యేక నిధులు.. సింగూరుకు రూ.120 కోట్లు : మంత్రి సీతక్క

ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. సింగూరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రూ.120 కోట్లు కేటాయించారు.
Telangana Minister Seethakka
మంత్రి సీతక్క
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లు, ఇతర జిల్లాల్లో తక్షణ అవసరాల కోసం రూ. కోటి చొప్పున నిధులను ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించారు. ఈ నిధులతో అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేసి, ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శనివారం ఉదయం మిషన్‌ భగీరథ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కృపాకర్‌ రెడ్డితో పాటు పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్లతో మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటిఎద్దడి ఎదురయ్యే ప్రాంతాల్లో స్థానిక వనరులను వినియోగించుకోవాలని, అవసరమైన చోట బోరుబావులను అద్దెకు తీసుకోవాలని, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. చేతిపంపులు, సింగిల్‌ ఫేజ్‌, త్రీ ఫేజ్‌ నీటి సరఫరా పథకాలు, బావులు తదితర స్థానిక నీటి వనరులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ సరఫరాలో అంతరాయం ఏర్పడే గ్రామాలు, భూగర్భజలాలు అడుగంటిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టంచేశారు. నీటి పొదుపు, ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.

రిజర్వాయర్లలో నీటి నిల్వలపై పర్యవేక్షణ

రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. హైదరాబాద్‌, మేడ్చల్‌, ఖమ్మం, యాదాద్రి సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి వనరుల వద్ద ఇప్పటికే నిర్మించిన ఇంకుడు గుంతలు, మ్యాజిక్‌ పిట్లలో నీరు ఇంకేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పురోగతిలో ఉన్న నిర్మాణాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.