సర్వోత్తంరెడ్డి గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలి

యువత తమ గ్రామాలను, కుటుంబాలను విడిచిపెట్టి ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తగ్గాలంటే స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరగాలని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు.
Seethakka
Published on: 

ప్రభాత ఉదయం, ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర్వహించిన సన్నాహక సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో, ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తల కష్టనష్టాలు, నిరంతర శ్రమ వల్లే నాయకులు ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ములుగు జిల్లా ప్రధానంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలతో కూడుకున్న జిల్లా అని, ఇక్కడి పేద యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, ఉపాధి అవకాశాల కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటికే పలు జాబ్ మేళాలు నిర్వహించినట్లు వివరించారు. యువత తమ గ్రామాలను, కుటుంబాలను విడిచిపెట్టి ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తగ్గాలంటే స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ఐటీ రంగంతోపాటు ఆయిల్‌ఫామ్ పరిశ్రమ, ఇతర పరిశ్రమలను తీసుకురావడానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.