టీజీ–టీ మార్స్ డీజీగా అకున్ సబర్వాల్?

ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీజీ టీ మార్స్‌లో సుమారు 300 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
 IPS Officer Akun Sabharwal
IPS Officer Akun Sabharwal
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీజీ టీ మార్స్‌ (TG TMARS)కు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ నేతృత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 300 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ

జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్‌ నిర్వహణను మెరుగుపరచడం, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 24న టీజీ టీ మార్స్‌ ఏర్పాటుకు జీవో జారీ చేసింది. ఈ విభాగాన్ని డీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని అందులో పేర్కొంది. ఈ క్రమంలో టీ మార్స్‌కు డీజీగా అకున్​ సబర్వాల్​ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి..

2001 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ ప్రస్తుతం ఐజీపీ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. డిప్యుటేషన్‌పై సుమారు ఆరేళ్లపాటు ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) పరిధిలోని లడఖ్‌, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో పని చేశారు. కేంద్ర సర్వీసులు ముగియడంతో ఇటీవల రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేశారు.

మూడు విభాగాలతో టీ మార్స్‌?

టీజీ టీ మార్స్‌లో భాగంగా నగర ట్రాఫిక్‌ నియంత్రణ, ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలను గుర్తించడం, అమలు చర్యలను పర్యవేక్షించడం, ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతాలు, పరిస్థితులపై సమాచారాన్ని విశ్లేషించడం వంటి అంశాలపై ఈ విభాగాలు దృష్టి సారించే అవకాశం ఉంది.