

ప్రభాత ఉదయం, కొత్తగూడెం: ప్రైవేట్ ట్రావెల్స్ బస్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ దుర్ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నవభారత్ సెంటర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పాల్వంచ పట్టణ ఎస్ఐ నాగరాజు తెలిపిన ప్రకారం.. నవభారత్‌కు చెందిన సతీశ్‌రెడ్డి(40) సింగిరేణి ఉద్యోగి. ఉదయం ఆయన టీ తాగేందుకు నవభారత్ సెంటర్‌కు వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు బైక్ ఎక్కాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి భద్రాచలం వైపు ప్రయాణిస్తున్న బీఎస్‌ఆర్ ట్రావెల్స్ బస్ లగేజీ డోర్ తెరిచి ఉంది. బస్సు ముందుకు కదులుతూ లగేజీ డోర్ బైక్ ఎక్కిన సతీశ్‌రెడ్డి తలకు బలంగా తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.