

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : సింగరేణి సంస్థ జాతీయస్థాయిలో ప్రతిభను చాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంస్థకు చెందిన ఐదు బొగ్గు గనులు ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించాయి. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చేతుల మీదుగా సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఈ అవార్డులను అందుకున్నారు. ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించిన గనుల్లో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్‌కేఎన్‌టీ, ఆర్‌కే-6 ఇంక్లైన్, సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరీగూడ ఓసీ, రామగుండం-3 ఏరియాలోని ఆర్‌జీఓసీ-1 ఉన్నాయి.
84 అంశాల ఆధారంగా..
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది దేశంలోని బొగ్గు గనులకు స్టార్ రేటింగ్ ప్రకటిస్తుంది. గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, కార్మికుల సంక్షేమం తదితర 84 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్న గనులను కేంద్ర బొగ్గు శాఖ పరిశీలక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి మూల్యాంకనం చేస్తుంది. ప్రాథమిక మూల్యాంకనం అనంతరం అత్యుత్తమ గనులను ఎంపిక చేస్తారు. వాటిలో మరింత మెరుగైన పనితీరు కనబరిచిన గనులను మరో కమిటీ ఎంపిక చేస్తుంది. మొత్తం 100 మార్కులకు 91 కంటే ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తారు. సింగరేణి సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. అవార్డుల ప్రదానోత్సవంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝా, కోల్ కంప్ట్రోలర్ సతీష్ కుమార్, కోల్ ఇండియా సీఎండీ సాయిరాం, సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కే వెంకటేశ్వర్లు, జీఎం (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) టీ శ్రీనివాస్, రామగుండం-3, శ్రీరాంపూర్ జీఎంలు మధుసూదన్, ఎం శ్రీనివాస్, బెల్లంపల్లి ఏరియా ఏజీఎం నరేందర్, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ-2, ఆర్‌కే న్యూటెక్ మేనేజర్లు రాజేశ్వర్, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.