

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : విధులకు డుమ్మా కొట్టడం వల్ల డిస్మిస్ అయిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు సింగరేణి మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిస్మిస్డ్ ఉద్యోగులకు తిరిగి అవకాశం కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరడంతో ఈ అంశాన్ని పరిశీలించాలని మేనేజ్మెంట్ను ఆయన ఆదేశించారు. 2023 నుంచి 2025 మధ్యకాలంలో గైర్హాజరైన వారికి ఉద్యోగం ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ మేనేజ్మెంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 46 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సున్నవారు అప్లయ్ చేసుకోవాలని సూచించింది. దీంతోపాటు విధుల నుంచి తొలగించడానికి ముందు ఐదేండ్లలో కనీసం రెండేండ్లలో 100 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. జనరల్ అసిస్టెంట్ ట్రైనీ, కేటగిరి-1 పోస్టులకు వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి. అర్హత కలిగిన డిస్మిస్డ్ ఉద్యోగులు దరఖాస్తును పూర్తి చేసి వారు చివరగా పనిచేసిన హెచ్‌వోడీకి ఈ నెల 14 లోపు అందించాలని మేనేజ్మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది.