

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఇటీవల దసరా బోనస్ అందుకున్న సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 5న దీపావళి బోనస్(పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్) చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి మేనేజ్మెంట్ను ఆదేశించినట్లు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1,10,250 చొప్పున బోనస్ చెల్లించనుంది. ఇప్పటికే లాభాల వాటా కింద దసరాకు దాదాపు రూ.600 కోట్లు చెల్లించగా, దీపావళి బోనస్‌గా రూ.419 కోట్లు కేటాయించారు. ఇప్పటికే సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఫైనాన్స్ అధికారులతో మాట్లాడారు. ఈ బోనస్ అధికారులకు కాకుండా ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు మాత్రమే ఇస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల విభాగంలో 190 పని దినాలు, ఓపెన్ కాస్ట్, సర్ఫేస్ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన కార్మికులకు పూర్తిస్థాయిలో బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ పని దినాల హాజరుంటే పని చేసిన కాలానికి నిష్పత్తి ప్రకారం లెక్క కట్టి చెల్లించనున్నారు. అయితే ఈ బోనస్ పొందడానికి కార్మికులకు కనీస అర్హతగా గతేడాది కనీసం 30 రోజులు పని చేసి ఉండాలని నిర్ణయించారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 38,000 మంది ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించనుంది.