

ప్రభాత ఉదయం, ఆందోల్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రజల తాగునీటి అవసరాల కోసం మంజీరా జలాశయంలోకి సోమవారం నీటిని వదిలారు. సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి సరఫరాకు గాను ప్రాజెక్టు 5, 6 నంబర్ గేట్లను 2 మీటర్లు ఎత్తి 0.15 టీఎంసీల(10806 క్యూసెక్కులు) నీటిని మంజీరాలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.736 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ ఏఈ నవీన్ తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు, గొర్ల కాపరులు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు నదిలోనికి వెళ్లొద్దని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు.