

ప్రభాత ఉదయం, వనపర్తి: సర్ ప్రక్రియలో జిల్లాలో భారీ సంఖ్యలో ఓటర్లు ముసాయిదా జాబితాకు దూరమయ్యారు. 2026 జూన్ 10 నాటికి 2,75,570 మంది ఓటర్లు ఉండగా, సర్ ముసాయిదా జాబితాలో 2,37,006 మంది ఓటర్ల పేర్లు మాత్రమే నమోదయ్యాయి. దీంతో 38,564 మంది ఓటర్లు ఏఎస్ డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూఫ్లికేట్) కేటగిరీలోకి వెళ్లినట్లు ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. దీంతో సుమారు 14 శాతం మేర తగ్గుదల నమోదైంది. తుది జాబితా తర్వాతే ఎన్ని ఓట్లు తొలగించారు.. ఎన్ని పేర్లు తిరిగి చేరాయి అనే అంశంపై స్పష్టతరానుంది.
తొలగింపు కాదు
ఏఎస్డీడీ జాబితాలో పేరు ఉంటే ఓటు హక్కు శాశ్వతంగా తొలగిపోయిందని భావించాల్సిన అవసరం లేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. జాబితాలో పేరు కనిపించని అర్హులైన ఓటర్లు ఫారమ్-6 ద్వారా తమ పేరును తిరిగి చేర్చుకునేందుకు అవకాశం కల్పించారు. బూత్ వారీగా ఏఎస్డీడీ జాబితాలను సైతం ప్రజలకు అందుబాటులో ఉంచారు.
ఓటర్లకు సూచన
సర్ ముసాయిదాలో ప్రతీ ఓటరు తమ పేరును పరిశీలించుకోవాలి. పేరు కనిపించకపోతే ఎన్నికల సంఘం సూచించిన విధంగా సంబంధిత ప్రక్రియను అనుసరించి అభ్యంతరం/క్లెయిమ్ దాఖలు చేయాలి. ఎన్నికల సంఘం ఓటర్ల సేవా పోర్టల్లో సర్-2026 కోసం ప్రత్యేక సేవలను అందుబాటులో ఉంచింది.