ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు కీలకం: కలెక్టర్ గరిమ అగ్రవాల్

18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.
Siricilla Collector Garima Agrawal
Siricilla Collector Garima Agrawal
Published on: 

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటు హక్కు బలమైన పునాది లాంటిదని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈ శిబిరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఫారం-6 ద్వారా అందిన దరఖాస్తుల వివరాలను బూత్ లెవల్ అధికారులను (బీఎల్‌వో) అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు మొత్తం 12 నూతన దరఖాస్తులు వచ్చినట్లు బీఎల్‌వోలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నూతన ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను ఆమె స్వయంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కూడా ఈ ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. మొదటిసారి ఓటర్లుగా నమోదు చేసుకోవాలనే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన యువతీయువకులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ ప్రత్యేక శిబిరాల రోజుల్లో సంబంధిత బీఎల్‌వోలు, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) నిర్దేశిత కేంద్రాలలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. 18 ఏళ్ల వయసు నిండే ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునేలా స్థానిక ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్ బాబు, ఇన్‌చార్జ్ తహశీల్దార్ మురళి, సర్పంచ్ చిలువేరి లావణ్య తదితరులు పాల్గొన్నారు.