అందాల తీరంలో.. ఆహ్లాదాల ‘‘సోమశిల’’

కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి అందాల జాతర
అందాల తీరంలో.. ఆహ్లాదాల ‘‘సోమశిల’’
Published on: 

ప్రకృతి సౌందర్యాలు, కృష్ణమ్మ అలల అందాలు, పచ్చని కొండల ఆకర్షణ, ఆధ్యాత్మికత - ఇవన్నీ సోమశిల ప్రత్యేకతలు. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న ఈ ప్రాంతం పర్యాటకులకు ప్రియమైన హాలిడే గమ్యస్థానంగా మారింది. సోమశిల పుణ్యక్షేత్రంపై ‘ప్రభాత ఉదయం’ ప్రత్యేక కథనం.

ప్రభాత ఉదయం, కొల్లాపూర్: దశాబ్దాల తరబడి పర్యాటక రంగంలో వెనుకబాటుకు గురైన ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడిప్పుడే పర్యాటకులను ఆకర్షిస్తోంది. కృష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు నది అలలపై ప్రయాణిస్తూ.. ప్రకృతి రమణీయ దృశ్యాలను వీక్షిస్తూ.. పక్షుల కిలకిలా రావాలతో మైమరిచి పోతున్నారు. మహిమాన్విత ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారి జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో అప్పటి ప్రభుత్వం అభివృద్ధి కోసం రూ.కోట్లు వెచ్చించింది. జూపల్లి కృష్ణారావు పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమశిల పర్యాటక కేంద్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు. పర్యాటకులకు సోమశిల వ్యూ పాయింట్ చూపేందుకు ఫారెస్ట్ శాఖ ద్వారా ప్రత్యేకమైన వసతులు కల్పించారు. రూ.కోట్లు ఖర్చు చేసి కాటేజెస్ అభివృద్ధి చేశారు.

ముగ్ధులను చేసే 300 కిలోమీటర్ల ప్రయాణం

కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలం డ్యాం వరకు కృష్ణా నదీతీరంలో ఊటీని తలపించేలా ఎన్నో ప్రకృతి సుందర దృశ్యాలు కనివిందు చేస్తాయి. నదీ ప్రయాణంలో శ్రీశైలం వరకు మార్గమధ్యంలో అమరగిరి, కోతి గుండు, చీమల తిప్ప, అంకాలమ్మ కోట, గుండ్లపెంట, చుక్కల గుండం, అక్కమహాదేవి గుహలు, పురాతన కట్టడాలు అద్భుతమైన శిల్పకళా సంపదలు దర్శనమిస్తాయి. తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణ గ్రామం వద్ద ప్రారంభమయ్యే కృష్ణమ్మ శ్రీశైలం డ్యాం వరకు 300 కిలోమీటర్ల ప్రవహిస్తోంది. నదీ తీరం వెంట జటప్రోలు మదన గోపాల స్వామి ఆలయం, మంచాలకట్ట వద్ద రామతీర్థం, సోమశిలలోని లలిత సోమేశ్వరాలయం, అమరగిరి సమీపంలోని మల్లయ్యశల, అంకాలమ్మ కోట, పురాతన శిల్పకళా సంపదలు ఉన్నాయి. శ్రీశైలానికి 16 కిలోమీటర్ల దూరంలోని నది ఒడ్డున అక్కమహాదేవి గుహలు కనిపిస్తాయి.

సోమశిల - శ్రీశైలం వరకు..

సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదీ తీరంలో ఇరువైపులా కొండలు, గట్లు కనువిందు చేస్తాయి. ఇక్కడ ఒక్కో కొండ ఒక్కో రకమైన నేల స్వభావం కలిగి ఉంటుంది. పక్క పక్కనే ఉన్న కొండల మధ్య చెట్లు పెరిగిన తీరులో కనిపించే రంగులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కొండల ఆకారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.  మార్గమధ్యంలో అమరగిరి ద్వీపాలు ఆహ్లాదాన్ని పంచుతాయి.

వంద కిలోమీటర్లు.. పది గంటలు

కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలం డ్యాం వరకు సుమారు వంద కిలోమీటర్లు పది గంటలు లాంచి లేదా మరబోటులో నదీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో నదిపై చీమలతిప్ప,  అంకాలమ్మకోట, చుక్కల గుండం, అక్కమహాదేవి గుహలు లాంటి చారిత్రక ప్రదేశాలు వీక్షిస్తూ పాతాళగంగ వరకు చేరుకోవచ్చు.  

కాలినడకన మల్లయ్యశలకు..

నల్లమల అడవిలో కృష్ణా నది ఒడ్డున మల్లయ్యశలలో పురాతన శివాలయం ఉంది. కొల్లాపూర్ నుంచి అమరగిరికి ఆరు కిలోమీటర్ల దూరం. ప్రత్యేక వాహనాల్లో గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని మల్లయ్యశలకు కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. మండు వేసవిలోనూ ఈ ఆలయం ఎదుట చిన్నపాటి నీటి చెలిమ నుంచి నిత్యం శుద్ధమైన నీరు పారుతుండటం విశేషం.

ఎత్తైన కొండపై అమ్మవారి కోట

కొల్లాపూర్ నుంచి అమరగిరికి ప్రత్యేక వాహనంలో ఆరు కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి పది కిలోమీటర్లు నదీ ప్రయాణం చేస్తే కోతి గుండు, చీమల తిప్ప, ఆ తరువాత అంకాలమ్మ కోట వస్తుంది. కాలినడకన అర కిలోమీటరు ఎత్తైన కొండను ఎక్కితే కోట ప్రదేశానికి చేరుకుంటాం. ఇక్కడ శిథిలమైన కోటగోడల రాళ్లకుప్పల మధ్య ఓ ఆలయంలో అంకాలమ్మ దేవత, ఆ పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తాయి. ఆలయానికి తూర్పున ఉన్న కొలను ఎప్పుడూ నీటితో ఉంటుంది. చీమల తిప్ప ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన 60 జాలర్ల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్నాయి.

మంచాలకట్టలో రామతీర్థం

కొల్లాపూర్ నుంచి పెంట్లవెల్లి అక్కడి నుంచి మంచాలకట్టకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆర్టీసీ సర్వీసులు ఉంటాయి. 15 ఏళ్ల క్రితం రామతీర్థాలయాన్ని పున:నిర్మించారు. ఆలయానికి అర కిలోమీటర్ దూరంలో కృష్ణా నది ఒడ్డున ప్రత్యేకంగా పుష్కర ఘాట్ నిర్మించారు. ఇక్కడ స్నానాల కోసం ప్రత్యేక వసతులు కల్పించారు.   

టూరిజం శాఖ ఆధ్వర్యంలో..

సుదూర ప్రాంతాల నుంచి కొల్లాపూర్ చేరుకున్న భక్తులు, పర్యాటకులు సుందరమైన దృశ్యాలను వీక్షిస్తూ పచ్చని కొండల నడుమ పది కిలోమీటర్లు ప్రయాణిస్తే మహా పుణ్యక్షేత్రమైన సోమశిలకు చేరుకోవచ్చు.  ఇక్కడికి ఆర్టీసీ సర్వీసులు కూడా ఉంటాయి. నదిలో పూర్తిస్థాయిలో నీరు ఉంటే ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లాంచీలో ప్రయాణించవచ్చు. నదీ ప్రయాణంలో ఓ చోట ఇరువైపులా కొండలపై చెట్లు దట్టంగా ఉండటంతో ఆకాశం కనిపించదు. పూర్తిగా చీకటిగా మారి అక్కడక్కడ చుక్కల మాదిరిగా కనిపిస్తాయి. దీంతో ఆ ప్రాంతానికి చుక్కల గుండంగా పేరు వచ్చింది.

లలితాసోమేశ్వరాలయం
లలితాసోమేశ్వరాలయం
నదీతీరంలో నిర్మించిన కాటేజెస్
నదీతీరంలో నిర్మించిన కాటేజెస్