ప్రభాత ఉదయం, హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గానికి మరో క్రీడా కానుక అందించింది. ఇప్పటికే కబడ్డీ అకాడమీ మంజూరు కాగా, తాజాగా స్విమ్మింగ్ పూల్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకుగాను మౌలిక వసతుల కల్పనకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఆర్థిక శాఖ జీఓ ఆర్‌టీ నంబర్ 1673 విడుదల చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పర్యవేక్షలో ఈ కేంద్రాలను అందుబాటులో ఉంచడంతో పాటు సిబ్బంది నియామకం, నిర్వహణ ఏర్పాట్లకు ఆమోదం తెలిపింది. ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువతకు ఈతలో శిక్షణతో పాటు రోయింగ్, కనోయింగ్ వంటి పోటీల్లో రాణించే అవకాశాలు లభించనున్నాయి.