

ప్రభాత ఉదయం, సూర్యాపేట : రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ ధాన్యం ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై రికవరీ చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ధాన్యం మాయం చేసిన రైస్ మిల్లర్లకు అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని రెండు రైస్ మిల్లుల్లో సుమారు రూ.27 కోట్ల విలువైన సీఎమ్మార్ ధాన్యం మాయమైనట్లు గుర్తించి నెల రోజులు దాటినా సంబంధిత మిల్లర్లపై కేసులు నమోదు చేయకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. సివిల్ సఫ్లై అధికారులు ముడుపులు పుచ్చుకుని మిల్లర్లపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దాడులలో భారీగా వెలుగుచూసిన మిల్లర్ల అక్రమాలు
సూర్యాపేట జిల్లాలో భారీగా సీఎమ్మార్ ధాన్యం పక్కదారి పట్టాయన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై శాఖ అధికారులు సంయుక్తంగా రెండు నెలల పాటు జిల్లాలోని మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలలో 18 మిల్లులలో రూ.600 కోట్ల సీఎమ్మార్ ధాన్యం బహిరంగ మార్కెట్‌కు తరలించి మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయగా, వీటిలో కొంతమంది మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించేందుకు చర్యలు చేపట్టారు.
ఆ రెండు మిల్లుల అక్రమాలపై చర్యలలో జాప్యం
పెన్‌పహాడ్ మండలంలోని మహాదేవ్ రైస్ మిల్లులో సుమారు 9 కోట్ల విలువైన 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు సివిల్ సఫ్లై దాడులలో గుర్తించినట్లు సమాచారం. నల్గొండ రైస్ ఇండస్ట్రీలో సుమారు 18 కోట్ల విలువైన 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. ఈ రెండు మిల్లులలో కలిపి దాదాపు రూ.27 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంత భారీ మొత్తంలో ధాన్యం మాయమైనట్లు గుర్తించినా, ఇప్పటివరకు కేసులు నమోదు చేయకుండా జాప్యం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ముడుపుల మాటున కేసుల మాయం?
గతంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం రికవరీలో అక్రమాలకు పాల్పడిన పలు మిల్లులపై అధికారులు రికవరీ చర్యలు చేపట్టారు. అయితే ఆ రెండు మిల్లులలో భారీ మొత్తంలో ధాన్యం గల్లంతైనట్లు గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముడుపుల మాటున అధికారులు అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల తీరుపై విచారణ జరిపించి, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మహాదేవ్, నల్గొండ రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించగా.. రెండు మిల్లుల్లో కలిపి 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించాం. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు జరిగింది-శ్రీకాంత్ రెడ్డి, డీటీ సీఎస్ సూర్యాపేట