రోడ్డు భద్రత సామాజిక బాధ్యత

సూర్యాపేట జిల్లాలో ప్రమాదాల నివారణకు 45 బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు.
Suryapet Collector and SP urged public to follow traffic rules and installed 45 black spots to prevent accidents
Suryapet Collector and SP urged public to follow traffic rules and installed 45 black spots to prevent accidents
Published on: 

సూర్యాపేట, ప్రభాత ఉదయం: రోడ్డు భద్రత ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత అని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె.నరసింహ పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాకేంద్రంలోని అంజనాపురి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరిక బోర్డులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ముమ్మర చర్యలు చేపడుతున్నాయన్నారు. అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌తో పాటు, ప్రమాద స్థలంలోనే తక్షణ సాయం పొందేందుకు స్థానిక అధికారుల ఫోన్ నంబర్లను హెచ్చరిక బోర్డులపై ప్రదర్శించినట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశమున్న 45 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. ప్రతి బ్లాక్ స్పాట్‌కు ఇరువైపులా 100 మీటర్ల పరిధిలో రెండు చొప్పున హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సందర్భంగా రహదారులపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీనివాస్​రెడ్డి, టౌన్, రూరల్​ సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.