

ఈనామ్‌లో రికార్డు ధర
క్వింటాలు రూ.9,200
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
ప్రభాత ఉదయం, సూర్యాపేట: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో పెసర్ల ధరలు రికార్డుస్థాయిలో పలుకుతున్నాయి. దేశంలోనే ప్రముఖ మార్కెట్లను తలదన్నేలా ఇక్కడ పంటకు మంచి మద్దతు లభిస్తోంది. మంగళవారం మార్కెట్‌కు వచ్చిన పెసర్లకు క్వింటాలుకు గరిష్టంగా రూ.9,200 ధర పలికినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సెక్రటరీ ఎండీ ఫసీయోద్దీన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8,780 కంటే కూడా ఇది చాలా ఎక్కువేనని చెప్పారు.
ఈనామ్‌లో పోటీ
సూర్యాపేట రైతులు ఎలాంటి చెత్తాచెదారం లేకుండా, క్వాలిటీ పెసర్లను మార్కెట్‌కు తీసుకురావడమే ఈ ధరకు కారణమని అధికారులు తెలిపారు. ఈనామ్ ప్లాట్‌ఫామ్‌లో వ్యాపారుల మధ్య గట్టిపోటీ ఉండటంతో ధరలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. దేశంలోనే అతిపెద్ద పెసర మార్కెట్ మహారాష్ట్రలోని అకోలా మార్కెట్‌లో క్వింటాలుకు రూ.8,851 ధర లభించగా, తమిళనాడులోని సేలం మార్కెట్‌లో కేవలం రూ.6 వేలు మాత్రమే పలుకుతోంది. వీటితో పోలిస్తే సూర్యాపేటలోనే అత్యధిక ధర నమోదు కావడం విశేషం.
ఇతర రాష్ట్రాలకు భారీగా ఎగుమతులు
సూర్యాపేట పెసర్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు భారీగా ఎగుమతి అవుతున్నాయని అధికారులు తెలిపారు. రైతులకు సరైన మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.