ప్రతి జిల్లా ఒక గ్రోత్ ఇంజన్ కావాలి : మంత్రి శ్రీధర్ బాబు

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
Minister Sridhar Babu
మంత్రి శ్రీధర్​ బాబు
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఆర్థిక ప్రగతి కేంద్రంగా (గ్రోత్ ఇంజన్) తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. స్థానిక పరిశ్రమలను గ్లోబల్ సప్లయ్​ చైన్‌తో అనుసంధానించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం టీ-హబ్‌లో నిర్వహించిన ‘మెగా ఎఫ్‌టీఏ అవుట్ రీచ్ ప్రోగ్రామ్’కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్య సాధనలో ఎగుమతులు కీలకమన్నారు. ఇండియా వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్(ఎఫ్‌టీఏలు) వల్ల కొత్త వాణిజ్య అవకాశాలు ఏర్పడుతున్నాయన్నారు. వీటిని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు అందిస్తామన్నారు. ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఉత్పత్తులను ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలన్నింటికీ విస్తరించాలని లక్ష్యంగా జిల్లాల వారీగా లభించే ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి, వాటి తయారీ, ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, వివిధ జిల్లాల కలెక్టర్లు మను చౌదరి, ప్రియాంక అలా, కుష్బూ గుప్తా, అనురాగ్ జయంతి, తదితరులు పాల్గొన్నారు.

‘అనుభవాధారిత అభ్యసనం– ఉన్నత విద్యలో నూతన మార్పు’ పుస్తకావిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి రచించిన ‘అనుభవాధారిత అభ్యసనం – ఉన్నత విద్యలో ఒక నూతన మార్పు’ పుస్తకాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నత విద్యలో నాణ్యతను పెంపొందించడంతో పాటు, విద్యను నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి రచించిన ఈ పుస్తకం ఎంతో విలువైనదని ప్రశంసించారు. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆచరణాత్మక జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, తరగతి గది అభ్యసనాన్ని వాస్తవ అనుభవాలకు అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు.

ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్​లో ఉచిత శిక్షణ

రాష్ట్రంలోని 643 టాస్క్ అనుబంధ కాలేజీల్లోని సుమారు లక్ష మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ తదితర ఇండస్ట్రీ ఓరియెంటెడ్ అంశాల్లో శిక్షణ ఇస్తామని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. తెలంగాణ ఏఐ అండ్​ క్లౌడ్​ స్కిల్లింగ్​ ఇనిషియేటివ్​ ప్రోగ్రామ్​లో భాగంగా అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​ సహకారంతో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం సెక్రటేరియట్​లో టాస్క్​, ఏడబ్ల్యూఎస్​ మధ్య అగ్రిమెంట్​ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, కాలేజీలపై ఆర్థిక భారం పడకుండా తెలంగాణ ఏఐ అండ్​ క్లౌడ్​ స్కిల్లింగ్​ ఇనిషియేటివ్​ ప్రోగ్రామ్​ చేపట్టినట్లు చెప్పారు. ఈ ప్రోగ్రామ్​ ద్వారా రాష్ట్రంలోని ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్ తదితర నాన్ స్టెమ్ కోర్సుల విద్యార్థులకు కూడా ప్రత్యేక లెర్నింగ్ ట్రాక్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు టాస్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ జాయింట్​ సెక్రటరీ అనుదీప్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి, ఏడబ్ల్యూఎస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ సందీప్ దత్తా, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ హెడ్ అభినవ్, కంట్రీ మేనేజర్(స్కిల్లింగ్, సోషల్ ఇంపాక్ట్) ప్రతిభ, ఏడబ్ల్యూఎస్ అకాడమీ టీపీఎం ఆకాంక్ష రాయ్ శర్మ పాల్గొన్నారు.