

ప్రభాత ఉదయం, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చిన 2బీ బార్లకు సంబంధించిన లక్కీ డ్రాను శుక్రవారం నిర్వహిస్తామని తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ క్యూర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధిలోని 14 బార్లకు, మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 27 బార్లకు వచ్చిన దరఖాస్తులకు లక్కీ డ్రాను నిర్వహించి, ఎంపికయ్యే వారికి లైసెన్సులను కేటాయిస్తామని వెల్లడించింది.
టీసీయూఆర్ పరిధిలోని 14 బార్లకు 4,251 దరఖాస్తులు రాగా, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 27 బార్లకు 4,519 దరఖాస్తులు వచ్చాయని అధికార వర్గాలు చెప్పాయి. అన్ని జిల్లాల్లోనూ శుక్రవారం ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా జరుగుతుందని తెలిపారు. టీసీయూఆర్ పరిధిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్, జిల్లాల్లో కలెక్టర్లు లక్కీ డ్రాల ద్వారా బార్ లైసెన్సీలను ఎంపిక చేస్తారన్నారు. దరఖాస్తుదారులకు ఇప్పటికే వాట్సాప్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని చేరవేశామని పేర్కొన్నారు. డ్రా తీసే వేదికలకు అందరూ ఉదయం 9 గంటలకల్లా చేరుకోవాలని ఎక్సైజ్ అధికారులు కోరారు.